2024 Loksabha Elections: రిటైర్‌మెంట్ వాయిదా వేసుకున్న సోనియా.. మోదీని నిలవరించడమే టార్గెట్

ABN , First Publish Date - 2023-03-31T15:59:23+05:30 IST

యూపిఏ(UPA) చైర్ పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తన రిటైర్ మెంట్ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు.

2024 Loksabha Elections: రిటైర్‌మెంట్ వాయిదా వేసుకున్న సోనియా.. మోదీని నిలవరించడమే టార్గెట్
Narendra Modi Versus Sonia

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల(2024 Loksabha Elections) నేపథ్యంలో యూపిఏ(UPA) చైర్ పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తన రిటైర్ మెంట్ ప్లాన్‌ను వాయిదా వేసుకున్నారు. రాహుల్(Rahul Gandhi) అనర్హత అంశంపై విపక్షాలను ఏకం చేసేందుకు ఆమె తిరిగి యాక్టివ్ అయిపోయారు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టి 2004లో యూపిఏ చైర్‌పర్సన్‌గా విపక్షాలను ఏకతాటిపై నిలిపారు. నాడు ఎన్డీయే బలం 138. యూపిఏ గెలిచిన స్థానాలు 145. తమ కంటే కేవలం 7 సీట్లు తక్కువ వచ్చినా ఎన్డీయేను(NDA) అధికారంలోకి రాకుండా సోనియా విజయవంతంగా అడ్డుకున్నారు. 18 ప్రాంతీయ పార్టీలను యూపిఏతో కలిసేలా చేసి కీలకంగా వ్యవహరించారు. యూపిఏ ప్రభుత్వం 2004లోనూ, 2009లోనూ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. తన విదేశీయత అంశంతో దూరమై ఎన్సీపీ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్న శరద్ పవార్‌ను(Sharad Pawar) తిరిగి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మన్మోహన్ సింగ్‌ను(Manmohan Singh) ప్రధానిని చేసి తానే చక్రం తిప్పారు. మళ్లీ ఇప్పుడు రాహుల్ అనర్హత, విపక్షాల అనైక్యత నేపథ్యంలో సోనియా తిరిగి యాక్టివ్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ఆమె చురుకైన పాత్ర పోషించేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు.

సోనియా పగ్గాలు చేపట్టాక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్

1999-25.8%

2004-26.5%

2009- 28.6%

2014- 19.5%

2019- 19.7%

సోనియా పగ్గాలు చేపట్టిన తర్వాత 1999 లోక్‌సభ ఎన్నికల్లో 25.8% ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి 19.7% కు పడిపోయింది.

సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ సాధించిన స్థానాలు

1998- 141

1999- 114

2004- 145

2009- 206

2014- 44

2019- 52-1 (రాహుల్ అనర్హతతో)

2014లో కేంద్రంలోకి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. 2009లో 206 ఉన్న కాంగ్రెస్ స్థానాల సంఖ్య 2019 నాటికి 52కు పడిపోయింది. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్(Congress) ప్రస్తుత బలం 51కి పరిమితమైంది.

దూసుకుపోతోన్న కమలనాథులు

2004-138-22.2%

2009-116-18.8%

2014-282-31.3%

2019-303-37.8%

2004లో బీజేపీ(BJP) ఓట్ షేర్ 22.2 శాతం ఉండగా 2019 నాటికి 37.8 శాతానికి చేరింది. 2014లో మోదీ నేతృత్వంలో 282, 2019లో 303 స్థానాలతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టేందుకు అన్ని వ్యూహాలు రచిస్తోంది.

దీంతో మోదీని, బీజేపీని నిలవరించేందుకు 76 ఏళ్ల వయసులో సోనియా గాంధీ మరోసారి నడుం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనైక్యంగా ఉన్న విపక్షాలను ఏకతాటిపైకి నడపడంలో గతంలో ఉన్న అనుభవంతో ఆమె మరోసారి సూపర్ యాక్టివ్ అయ్యారు. రాహుల్‌‌ను ప్రమోట్ చేయాలని చూసినా ఆయన బాధ్యతల స్వీకరణకు నో చెప్పారు. దీంతో అనారోగ్యం వల్ల రిటైర్‌మెంట్ ప్రకటించాలని యోచిస్తుండగానే రాహుల్‌ అనర్హత అంశం ఆమెను తిరిగి యాక్టివ్ అయ్యేలా చేసింది. రిటైర్‌మెంట్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. విపక్షాలను ఏకతాటికి తెచ్చే ముందు ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతలతోనూ కీలక సమావేశం జరిపారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో 18 పార్టీల ప్రతినిధులు హాజరయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలతో శివసేన ఉద్ధవ్ వర్గం నొచ్చుకోవడంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు స్వయంగా సోనియా రంగంలోకి దిగారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో భేటీ అయ్యారు. రాహుల్‌ను కూడా సమావేశంలో కూర్చోబెట్టుకున్నారు. సమావేశం తర్వాత సావర్క్‌పై రాహుల్ వ్యాఖ్యల వివాదం ముగిసినట్లేనని ప్రచారం జరిగింది. దీనికి తోడు సోనియా ధర్నాలు, ప్రదర్శనల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. గౌతం అదానీపై(Adani) జేపీసీ(JPC) వేయాలన్న అంశంపై నల్లచీర కట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. అనారోగ్యం విషయం దాదాపు మరచిపోయారు. పార్లమెంట్‌తో పాటు ప్రతిపక్షాలతో అన్ని సమావేశాల్లోనూ దర్శనమిస్తున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి సోనియా ప్రతిపక్షాలను ఏ మేరకు ఏకతాటిపైకి తీసుకురాగలరనేది రాగల కొద్ది రోజుల్లో స్పష్టం కానుంది. గతంలో మాదిరిగా ఎన్డీయేకు చెక్ పెట్టగలరా లేదా అనేది ఎన్నికలు సమీపించే నాటికి స్పష్టమౌతుంది.

Updated Date - 2023-03-31T16:14:23+05:30 IST