JDU Vs Amith Shah: బీసీ ముఖ్యమంత్రి అంటే అంత చులకనా?..అమిత్‌షాకు జేడీయూ స్ట్రాంగ్ కౌంటర్
ABN , First Publish Date - 2023-04-02T18:22:36+05:30 IST
బీహార్ నవడా జిల్లాలో జరిగిన ర్యాలీలో బీహార్ సర్కార్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు జనతాదళ్ (యునైటెడ్) ఖండించింది. రాష్ట్ర ప్రతిష్టను ..
పాట్నా: బీహార్ నవడా జిల్లాలో జరిగిన ర్యాలీలో బీహార్ సర్కార్‌పై అమిత్‌షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలకు జనతాదళ్ (యునైటెడ్) (JDU) ఖండించింది. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టింది. సాసారామ్‌లో జరిగిన అల్లర్లపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో(Nitish Kumar) మాట్లాడకుండా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌తో మాట్లాడటం ఏమిటని జేడీయూ నేత నీరజ్ కుమార్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.
''కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలు బీహార్ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. ఫెడరల్ స్ఫూర్తిని ఆయన పక్కనపెట్టి, ప్రజలు ఎన్నుకున్న సీఎంతో కాకుండా గవర్నర్‌తో మాట్లాడాల్సిన పని ఏముంది? వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి (నితీష్) అమిత్‌షాకు ఆమోదయోగ్యం కాకపోవడం వల్లే బీహార్ సీఎంతో ఆయన మాట్లాడలేదు'' అని నీరజ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. సాసారామ్‌లో జనాలను చంపేశారని అమిత్‌షా చెబుతున్నారని, ఆయనకు ధైర్యం ఉండే చనిపోయిన వార్ల పేర్లు చెప్పాలని సవాలు చేశారు. సాసారామ్ విషయంలో అమిత్‌షా నీచరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్‌షా
దీనికి ముందు, బీహార్‌లోని మహాకూటమి ప్రభుత్వంపై అమిత్‌షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాసారామ్, బిహార్ షరీప్ పట్టణంలో హింసకు కళ్లెం వేయడంలో బీహార్ ప్రభుత్వం విఫలమైందని, 2025లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అల్లర్లకు పాల్పడిన వాళ్లను తలకిందులుగా వేలాడదీస్తామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్ లలన్ సింగ్‌తో ఇవాళ ఉదయం తాను మాట్లాడానని, ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారని, బీహార్ గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారంటూ తనను ప్రశ్నించారని అన్నారు. అయితే తాను ఈ దేశానికి హోం మంత్రినని, బీహార్‌లో శాంతి భద్రతల పరిస్థితి కూడా తనదేనని చెప్పినట్టు అమిత్‌షా తెలిపారు.
40 సీట్లూ బీజేపీకే...
2024 లోక్‌సభలో భారతీయ జనతా పార్టీని మొత్తం 40 స్థానాల్లోనూ గెలిపించాలని ప్రజలు స్థిరనిశ్చయంతో ఉన్నట్టు అమిత్‌షా చెప్పారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, తేజస్వికి బీహార్ సీఎం పగ్గాలు అప్పగించి తాను ప్రధాని కావాలనే నితీష్ ఆశలు ఎప్పటికీ నెరవేరవని ఆయన తెగేసి చెప్పారు.