Kamal Haasan: నటుడు కమల్‏హాసన్ సంచలన నిర్ణయం... అదేంటో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-09-03T09:16:40+05:30 IST

‘మక్కల్‌ నీది మయ్యం’ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌(Kamal Haasan) డీఎంకే కూటమిలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

Kamal Haasan: నటుడు కమల్‏హాసన్ సంచలన నిర్ణయం... అదేంటో తెలిస్తే...

- రెండు పార్టీల నేతల చర్చలు షురూ!

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘మక్కల్‌ నీది మయ్యం’ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌(Kamal Haasan) డీఎంకే కూటమిలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆది నుంచి బీజేపీ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కమల్‌.. ఒంటరి పోటీకి బలం సరిపోదన్న ఉద్దేశంతో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి సాగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా డీఎంకే(DMK) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమితో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. ఆది నుంచి కమల్‌ మతవాద సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఎంఎన్‌ఎం స్థాపించాక బీజేపీని, దాని మిత్రపక్షాలను కమల్‌ తూర్పారబడుతున్నారు. మరీ ముఖ్యంగా మోదీ విధానాలను సైతం ఆయన పలుమార్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో.. కాంగ్రెస్‌ నేతలతో చేయికలిపారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పాదయాత్రకు సైతం కమల్‌ సంఘీభావం తెలిపారు. దీంతో ఆ పార్టీతో కమల్‌ జత కట్టడం ఖాయమంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇప్పుడది కార్యరూపం దాల్చనున్నట్లు తెలిసింది. కాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల ముంబైలో భేటీ అయిన ‘ఇండియా’ కూటమి నేతలు... సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు పూర్తి చేయాలని నిర్ణయించారు. అంతర్గత చర్చల్లోనూ, బహిరంగంగానూ ఆ కూటమి నేతలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ ప్రకటించారు.

ఆ మేరకు ఆ కూటమి నేతలు సీట్ల సర్దుబాటు దిశగా సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ నెలాఖరుకే ఆయా పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన వస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్‏కు విశ్వాసమిత్రుడైన డీఎంకే రాష్ట్రంలో ఆ కూటమికి నేతృత్వం వహించనుంది. అందువల్ల సీట్ల సర్దుబాటు, స్థానాల ఖరారుపై ఆ పార్టీదే తుది నిర్ణయమని తేలిపోయింది. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వున్న 39 స్థానాలకు 38 స్థానాలను డీఎంకే కూటమి గెలుచుకుంది. డీఎంకే 20, కాంగ్రెస్‌9, సీపీఐ2, సీపీఎం2, డీపీఐ 1, మిత్రపక్షాలు 4 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఈసారి కూడా ఆయా పార్టీలకు అన్నే స్థానాలు ఇవ్వాలని డీఎంకే అధినేత స్టాలిన్‌ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే గత ఎన్నికల్లో తేని నియోజకవర్గం కాంగ్రెస్‏కు కేటాయించగా, అక్కడ అన్నాడీఎంకే అభ్యర్థి రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. అందువల్ల ఈ సారి కాంగ్రెస్‏కు 9 స్థానాలు ఇస్తారా? లేక పది స్థానాలా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎంఎన్‌ఎం డీఎంకే కూటమిలో చేరితే ఆ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్‌ చిహ్నంపై పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. తద్వారా కాంగ్రెస్‏కు 10 స్థానాలు రావడంతో పాటు ఎంఎన్‌ఎంకు ఒక ఎంపీ సీటు ఇచ్చినట్లవుతుందని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముందుగా ఎంఎన్‌ఎంతో పొత్తుపై స్పష్టతవస్తే సీటు వ్యవహారం తేల్చవచ్చని డీఎంకే నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా డీఎంకే కూటమిలో స్థానాల సంఖ్యపై స్పష్టత ఉన్నప్పటికీ ఎవరికి ఏ స్థానం కేటాయించాలన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొన్నట్లు తెలిసింది. కొంతమంది సిట్టింగులు ప్రజాదరణ కోల్పోవడం, మరికొంతమంది స్థానమార్పిడి కోరుకుంటుండడం తదితరాల కారణంగా కొన్నిస్థానాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చని సమాచారం.

‘ఇండియా’ కూటమి కమిటీలో ఐదుగురు డీఎంకే నేతలు

పెరంబూర్‌: ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీల్లో డీఎంకేకు చెందిన ఐదుగురికి చోటు కల్పించారు. ముంబైలో శుక్రవారం జరిగిన సమావేశంలో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల పనులు సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీల్లో డీఎంకేకు చెందిన ఐదుగురు ఎంపీలకు స్థానం కల్పించారు. సమన్వయం, ఎన్నికల వ్యూహాల కమిటీలో డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, ప్రచార కమిటీలో ఎంపీ తిరుచ్చి శివ, సోషల్‌ మీడియా ఆర్గనైజింగ్‌ కమిటీలో ఎంపీ దయానిధి మారన్‌, మీడియా ఆర్గనైజింగ్‌ కమిటీలో ఎంపీ కనిమొళి, మేనేజ్‌మెంట్‌ కమిటీలో ఎంపీ ఎ.రాజా ఉన్నారు.

Updated Date - 2023-09-03T09:21:50+05:30 IST