Disqualification: సీఎంకు హైకోర్టు నోటీసు
ABN , First Publish Date - 2023-07-28T19:05:25+05:30 IST
ఎన్నికల్లో తప్పుడు విధానాలను అనుసరించారనే ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని జస్టిస్ సునీల్ దత్ యాదవ్ ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు.
బెంగళూరు: ఎన్నికల్లో తప్పుడు విధానాలను అనుసరించారనే (Malpractice) ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని జస్టిస్ సునీల్ దత్ యాదవ్ ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు.
వరుణ (Varuna) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ అదే నియోజకవర్గానికి చెందిన కేఎం శంకర అనే వ్యక్తి పిటిషన్ వేశారు. సిద్ధరామయ్య ఎన్నికల సమయంలో అవినీతి విధానాలకు పాల్పడ్డారని ఆయన అభియోగంగా ఉంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది కరప్ట్ ప్రాక్టీస్ కిందకు వస్తుందని, ఇది లంచమివ్వడంతో సమానమని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(2)ను ఉల్లంఘించడమవుతుందని పిటిషనర్ వాదించారు. సిద్ధరామయ్య ఎన్నికల సమయంలో అవినీతి విధానాలకు పాల్పడినట్టు ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గత మేలో జరుగగా, కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికార బీజేపీని గద్దెదింపింది. వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య గెలిచారు.