Pinarayi Vijayan: ప్రధానికి కేరళ సీఎం లేఖ...
ABN , First Publish Date - 2023-03-07T16:21:10+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేరళ ..
తిరువనంతపురం: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) అరెస్టుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) మంగళవారంనాడు లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలకు తావిచ్చే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని అన్నారు. వాటిని తొలగించేందుకు కృషి చేయాలని ఆ లేఖలో ప్రధానిని ఆయన కోరారు. నిర్దిష్ట చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తున్నారనే అభిప్రాయాలకు సిసోడియా అరెస్టు మరింత ఊతమిస్తోందని అన్నారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై గత ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.
సిసోడియా కేసులో నగుదు స్వాధీనం చేసుకోవడం వంటి ఎలాంటి సాక్ష్యాలు లేవని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆప్ నేత సీబీసీ సమన్లతో విచారణ ముందుకు కూడా హాజరయ్యారని ప్రధానికి రాసిన లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. విచారణకు ఆటంకం కలుగుతోందని భావించినప్పుడు మాత్రమే అరెస్టు అనివార్యమవుతుందని, అలా కాని పక్షంలో అరెస్టు జోలికి వెళ్లక పోవడమే సబబని అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం నగదు పట్టుబడటం వంటి ఎలాంటి అనుమానాస్పద సాక్ష్యాలు లేవని, చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందేనని, అయితే రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే విస్తృతాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకునే విధంగా చర్యలు ఉంటాలని అన్నారు. రాజకీయ కారణాలే ఇందుకు కారణమా అనే అపోహలను తొలగించాలని ప్రధానిని కోరారు. సమాఖ్య స్ఫూర్తి, సిద్ధాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
కేసు విచారణలో ఉన్నందున దాని మంచిచెడ్డలపై తాను మాట్లాడదలచుకోలేదని విజయన్ అన్నారు. న్యాయం జరగడమే కాదు...న్యాయం జరిగేలా చూడటం కూడా సహజన్యాయ సూత్రంలో కీలకమని చెప్పారు. రాజకీయాల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే ప్రస్తుత అభిప్రాయాలను తొలగించేందుకు ప్రధానమంత్రి మార్గదర్శకంగా ఉండగలరన్న ఆశాభావాన్ని ఆయన తన లేఖలో వ్యక్తం చేశారు. కాగా, కేరళ సీఎం ప్రధానికి లేఖ రాసిన రెండు రోజుల ముందే ఇదే విషయంపై ఎనిమిది విపక్ష పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు మోదీకి లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆ లేఖలో ఆరోపించారు. ప్రధానికి లేఖ రాసిన విపక్ష నేతల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉన్నారు.