Khalistanis audio : ఖలిస్థానీల సంచలన ఆడియో వెలుగులోకి... ఢిల్లీలో దారుణానికి హెచ్చరిక...

ABN , First Publish Date - 2023-03-25T20:36:37+05:30 IST

ప్రత్యేక ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారులు మాట్లాడినట్లు చెప్తున్న ఓ ఆడియో క్లిప్‌ సంచలనం సృష్టిస్తోంది.

Khalistanis audio : ఖలిస్థానీల సంచలన ఆడియో వెలుగులోకి... ఢిల్లీలో దారుణానికి హెచ్చరిక...
Khalistani flag, Indian National Flag

న్యూఢిల్లీ : ప్రత్యేక ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారులు మాట్లాడినట్లు చెప్తున్న ఓ ఆడియో క్లిప్‌ సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో భారత దేశ జాతీయ జెండాను తొలగించి, ఖలిస్థాన్ జెండాను ఎగురవేస్తామని ఈ ఆడియో క్లిప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎనిమిది రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడినట్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)లను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి ఈ ఆడియో క్లిప్‌ వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఈ విమానాశ్రయం పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153, 153-ఏ, 505 ప్రకారం ఈ కేసును నమోదు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దీనిపై దర్యాప్తు చేస్తోంది.

ఇదిలావుండగా, ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జీ20 సదస్సు సెప్టెంబరు నెలలో జరగవలసి ఉంది. దీని కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.

తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్

ఎనిమిది రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amrit Pal Singh) మార్చి 20న అమృత్‌సర్‌లో గడిపినట్లు తెలుస్తోంది. ఆయన సంప్రదాయ వస్త్రాలను కాకుండా జాకెట్, ప్యాంటు, నల్ల కళ్లజోడు ధరించి నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అమృత్‌సర్‌లోని తన బంధువుల ఇంట్లో ఆయన గడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అమృత్‌పాల్ సింగ్ అమృత్‌సర్ నుంచి హర్యానా (Haryana)లోని కురుక్షేత్రకు వెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు. కురుక్షేత్ర నుంచి ఢిల్లీ నగరానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన ఓ సాధువు వేషంలో శుక్రవారం ఢిల్లీ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కశ్మీరు గేటులోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ వద్ద ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

అమృత్‌పాల్ సింగ్ కురుక్షేత్రలోని బల్జీత్ కౌర్ అనే మహిళ ఇంటి నుంచి వెళ్తుండగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆమె ఇంట్లో ఆయనతోపాటు ఆయన సహచరుడు పపల్‌ప్రీత్ సింగ్‌ కూడా ఆశ్రయం పొందినట్లు పోలీసులు చెప్పారు. ఆ మహిళను హర్యానా పోలీసులు అరెస్ట్ చేసి, పంజాబ్ పోలీసులకు అప్పగించారు.

ప్రజల్లో అశాంతి రగిలించడం, హత్యాయత్నం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలు అమృత్‌పాల్ సింగ్‌పై నమోదయ్యాయి. ఆయనను పట్టుకునేందుకు గత శనివారం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన మద్దతుదారుల్లో చాలా మందిని పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, ఆయుధాలు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..

Karnataka : భాషలతో రాజకీయాలు : మోదీ

Updated Date - 2023-03-25T20:36:37+05:30 IST