India vs Canada: భారత్, కెనడా మధ్య పెరుగుతున్న వివాదం.. మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్య!

ABN , First Publish Date - 2023-09-21T12:02:17+05:30 IST

ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంతలోనే కెనడాలో మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్యకు గురయ్యాడు.

India vs Canada: భారత్, కెనడా మధ్య పెరుగుతున్న వివాదం.. మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్య!

ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంతలోనే కెనడాలో మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్యకు గురయ్యాడు. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘటనలో ఈ హత్య జరిగింది. చనిపోయిన వ్యక్తి ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్ అలియాస్‌ సుఖా దునేకేగా గుర్తించారు. కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో ఈ హత్య జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టెర్రరిస్ట్ అర్ష్‌దీప్ దల్లాకు సుఖ్‌దూల్ సింగ్ సన్నిహితుడు. ఖలిస్తాన్, కెనడాతో సంబంధాలు కలిగి ఉన్న 43 మంది గ్యాంగ్‌స్టర్లలో ఒకడు. సుఖ్‌దూల్ సింగ్ భారత్‌కు చెందిన వ్యక్తినే కావడం గమనార్హం. ఏ-కేటగిరీ గ్యాంగ్ స్టర్ అయిన సుఖ్‌దూల్ సింగ్ పంజాబ్‌లోని మోఘా జిల్లాలో గల దేవిందర్ బంబిహా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి. అతనిపై అనేక క్రిమినల్ కేసులున్నాయి. 2017లో అతను నకిలీ ధృవ పత్రాలతో కెనడాకు పారిపోయాడు. ఆ సమయంలో అతనిపై 7 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అతను దేశం దాటేందుకు సహహకరించిన ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. అనంతరం కెనడా నుంచే సుఖ్‌దూల్ సింగ్ పని చేసినట్లు సమాచారం. గతేడాది మార్చి 14న జలంధర్‌లోని మల్లియన్ గ్రామంలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో క్రీడా కారుడు సందీప్ సింగ్ నంగల్‌ను తన సహచరుల సాయంతో హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. పంజాబ్, దాని సమీప రాష్ట్రాల్లో అతనిపై 20కిపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాగా సుఖ్‌దూల్ సింగ్ ఖలీస్థానీ ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.


పంజాబ్‌కు చెందిన దాదాపు 30 మంది గ్యాంగ్‌స్టర్లు కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాలకు పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం. వీరంతా తప్పుడు ప్రయాణ పత్రాలతో దేశం దాటి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అందులో 8 మంది కెనడాలోనే ఉన్నట్లు సమాచారం. ఆ 8 మందిలో ఒకడైన సుఖ్‌దూల్ సింగ్ ప్రస్తుతం హత్యకు గురయ్యాడు. కాగా ఖలీస్థాన్ ఉగ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య చిచ్చురేపింది. అంతటితో ఆగని ట్రూడో కెనడాలోని భారత్ రాయబారిపై బహిష్కరణ వేటు వేశారు. అయితే ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడాకు కౌంటర్‌గా భారత్ కూడా మన దేశంలోని కెనడా రాయబారిపై బహిష్కరణ వేటు వేసింది. అయితే తాజాగా సుఖ్‌దూల్ సింగ్ కూడా హత్యకు గురి కావడంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2023-09-21T12:02:17+05:30 IST