Manish Sisodia Letter: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓపెన్ లెటర్.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు..
ABN , First Publish Date - 2023-04-07T13:35:52+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి సరైన విద్యార్హతలు లేకపోవడం దేశానికి అపాయకరమని ప్రస్తుతం జైలులో ఉన్న
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి సరైన విద్యార్హతలు లేకపోవడం దేశానికి అపాయకరమని ప్రస్తుతం జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సీనియర్ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా మోదీ విద్యార్హతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో సిసోడియా సీబీఐ, ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
దేశ ప్రజలను ఉద్దేశించి సిసోడియా స్వదస్తూరీతో రాసినట్లు చెప్తూ ఓ లేఖను శుక్రవారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నేటి యువతకు అనేక ఆకాంక్షలు, ఆశలు, అభిలాషలు ఉన్నాయని, వారు ఏదో సాధించాలని కోరుకుంటున్నారని, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని సిసోడియా ఈ లేఖలో తెలిపారు. ప్రపంచాన్ని జయించాలని యువత కోరుకుంటున్నట్లు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సాధించాలనుకుంటున్నట్లు తెలిపారు. నేటి యువత ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం తక్కువ చదువులు చదివిన ప్రధాన మంత్రికి ఉంటుందా? అని ప్రశ్నించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోందన్నారు. కృత్రిమ మేధాశక్తి గురించి ప్రపంచం మాట్లాడుతోందన్నారు. అటువంటి సందర్భంలో ప్రధాన మంత్రి మాటలను విన్నపుడు దిగ్భ్రాంతికి గురవుతున్నానని చెప్పారు. డర్టీ డ్రెయిన్‌లో గొట్టం పెట్టి డర్టీ గ్యాస్‌ని తయారు చేసి, దానితో టీ కాచుకోవచ్చునని, ఆహారాన్ని వండుకోవచ్చునని మోదీ చెప్పడం విని తన మనసు విచారంతో క్రుంగిపోతోందని తెలిపారు. డ్రెయిన్ నుంచి వచ్చే డర్టీ గ్యాస్‌తో ఆహారాన్ని కూడా వండుకోవచ్చునా? అని ప్రశ్నించారు. అది సాధ్యం కాదన్నారు. మేఘాల వెనుక ఉన్న విమానాన్ని రాడార్లు గుర్తించలేవని మోదీ చెప్పడంతో యావత్తు ప్రపంచానికి ఆయన బఫూన్ అయ్యారన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆయనను ఎగతాళి చేస్తున్నారన్నారు.
మోదీ అల్ప విద్యావంతుడని, సైన్స్ గురించి ప్రాథమిక పరిజ్ఞానం లేదని ప్రపంచమంతటికీ తెలుసునని చెప్పారు. ఇతర దేశాల నేతలు మోదీని ఆలింగనం చేసుకుంటున్నారని, ప్రతి కౌగిలింతకు భారీగా గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఏ కాగితాల మీద ఆయన చేత సంతకాలు పెట్టించుకుంటున్నారో తెలియదన్నారు. మోదీ తక్కువ చదువులు చదివిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఏమీ అర్థం కాదన్నారు.
తాను విద్యావంతుడిని కానని, గ్రామీణ పాఠశాలలో చదివానని మోదీ ఓ వీడియోలో చెప్పారన్నారు. నిరక్షరాస్యుడవడం, తక్కువ చదువులు చదవడం గర్వించదగిన అంశమా? అని ప్రశ్నించారు. తక్కువ చదువులు చదవడాన్ని గర్వకారణంగా భావించే ప్రధాన మంత్రి ఉన్న దేశం తన పిల్లలకు ఉత్తమ విద్యను అందజేయదని చెప్పారు.
మోదీ చదివిన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లను ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. అయితే వాటిని ఇవ్వవలసిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. కేజ్రీవాల్‌కు రూ.25,000 జరిమానా విధించింది.
ఢిల్లీ మద్యం విధానం (Delhi Excise Policy 2021-22) రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయనకు బెయిలు రాలేదు.
ఇవి కూడా చదవండి :
Ayodhya Ramalayam : అయోధ్య రామాలయం నిర్మాణంలో కీలక ఘట్టం
CNG, PNG Price : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ ధరలు దాదాపు 11 శాతం తగ్గుదల..