Modi visit MP: ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చజెండా
ABN , First Publish Date - 2023-06-27T12:03:19+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ సిటీలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంగళవారంనాడు ప్రారంభించారు. రైళ్లకు పచ్చజెండా ఊపడానికి ముందు ప్రధాని అక్కడి రైలు సిబ్బంది, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి సిద్ధమైన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ (Bhopal) సిటీలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (Vande Bharat Express trains) మంగళవారంనాడు ప్రారంభించారు. రైళ్లకు పచ్చజెండా ఊపడానికి ముందు ప్రధాని అక్కడి రైలు సిబ్బంది, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి సిద్ధమైన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగుభాయ్ సి పటేల్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని ప్రారంభించిన ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాణి కమలాపతి-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఖజురహో-భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, మడగావ్ (గోవా)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హటియా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.
రాణి కమలాపతి (భోపాల్)-జబల్‌పూర్ భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని మహాకౌషల్ ప్రాంతం (జబల్‌పూర్) నుంచి సెంట్రల్ రీజిన్ (భోపాల్)ను అనుసంధానిస్తుంది. రెండు నగరాల మధ్య గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ రైళ్ల కంటే 30 నిమిషాల ముందే ఈ రైలు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మధ్యప్రదేశ్ మూడో సెమీ-హైస్పైడ్ రైలు మాల్వా ప్రాంతం (ఇండోర్), బుందేల్ ఖండ్ ప్రాంతం (ఖుజరహో), సెంట్రల్ రీజియన్ (భోపాల్) మధ్య నడుస్తుంది. మహాబలేశ్వర్, మాండు, మహేశ్వర్, ఖజురహో, పన్నా వంటి పర్యాటక ప్రాంతాలకు ఈ రైలు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. కాగా, గోవాకు తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అయిన ముంబై-మడగావ్ (గోవా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబై ఛత్రపతి మహరాజ్ టెర్మినస్, గోవా మడగావ్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. శుక్రవారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. సుమారు గంట ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ముంబైతో అనుసంధానించే ఈ వందేభారత్ రైలుతో గోవా, ముంబై మధ్య పర్యాటక, వాణిజ్యాభివృద్ధి జరుగనుంది. కర్ణాటకలోని ధార్వాడ్-బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కీలక సిటీలైన ధార్వాడ్, బుబ్బళ్ళి, దేవన్‌గెరలను బెంగళూరుతో కలుపుతుంది. ఇతర రైళ్ల కంటే ఈ వందేభారత్ రైలులో ప్రయాణించడం వల్ల 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. కర్ణాటకకు ఇది రెండో వందేభారత్ రైలు కాగా, మొదటి రైలు చెన్నై, బెంగళూరు, మైసూరు మధ్య నడుస్తుంది. హతియా-పాట్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖాండ్, బీహార్‌కు తొలి వందేభారత్ రైలు.