Mamata Banerjee: స్టాలిన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని తేల్చేసిన తృణమూల్.. తెలియదంటూ ట్విస్ట్ ఇచ్చిన మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2023-09-04T20:06:05+05:30 IST

‘సనాతన ధర్మం’పై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు అతని వ్యాఖ్యల్ని...

Mamata Banerjee: స్టాలిన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని తేల్చేసిన తృణమూల్.. తెలియదంటూ ట్విస్ట్ ఇచ్చిన మమతా బెనర్జీ

‘సనాతన ధర్మం’పై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు అతని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కూడా స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించింది. అతని వ్యాఖ్యలతో ఇండియా కూటమికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ‘‘ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం, ఖండించదగినవి. మనం మన సంస్కృతి, మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలి. ఎవరైనా సనాతన ధర్మాన్ని విమర్శిస్తే.. వాటిని తీవ్రంగా ఖండించాల్సిందే. అతను ఎవరైనా కావొచ్చు.. ఈ వ్యాఖ్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానించిందని అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇండియా కూటమితో స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధం లేదని కునాల్ స్పందించారు.


బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండించారు. తనకు దక్షిణ భారతం, తమిళనాడు ప్రజలంటే ఎంతో గౌరవం ఉందని.. అయితే, అన్ని మతాలవారిని గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయానికొస్తే.. అతడొక జూనియర్ అని, అతడు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశాడో తనకు తెలిదయని అన్నారు. ప్రతి మతాన్ని గౌరవించాలన్నదే తన భావన అని చెప్పారు. అటు.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ కూడా స్టాలిన్ వ్యాఖ్యలపై తన అసమ్మతిని వ్యక్తపరిచారు. మనం అన్ని మతాలను సమానంగా గౌరవించాలని.. ఏ మతంపై కూడా మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయకూడదని ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు.

కాగా.. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని, దీనిని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మరుక్షణమే తారాస్థాయిలో వ్యతిరేకత మొదలైంది. స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వచ్చాయి. ఈ వ్యాఖ్యలనే బీజేపీ పావుగా వాడుకొని.. విపక్ష కూటమి ఇండియాను, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంది. స్టాలిన్ వ్యాఖ్యల్ని ‘ద్వేషపూరిత ప్రసంగం’గా పేర్కొన్న బీజేపీ.. హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రతిపక్ష కూటమి ప్రాథమిక ఎజెండా అని ధ్వజమెత్తింది. ఉదయనిధిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కూడా కోరింది.

Updated Date - 2023-09-04T20:06:05+05:30 IST