Cow Hug Day: ఆవు పొడిస్తే పరిహారం మీరు ఇస్తారా?: బీజేపీని నిలదీసిన మమత

ABN , First Publish Date - 2023-02-13T17:19:40+05:30 IST

ఫిబ్రవరి 14వ తేదీని 'గోమాతల ఆలింగనం రోజు''గా పాటించాలంటూ కేంద్రం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్నప్పటికీ విమర్శల పర్వం..

Cow Hug Day: ఆవు పొడిస్తే పరిహారం మీరు ఇస్తారా?: బీజేపీని నిలదీసిన మమత

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14న 'గోమాతల ఆలింగనం రోజు'' (Cow Hug Day)గా పాటించాలంటూ కేంద్రం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి... ఆ తర్వాత ఉపసంహరించుకున్నప్పటికీ విమర్శల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. గోవులు పొడిస్తే పరిస్థితి ఏమిటని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) సోమవారంనాడు ప్రశ్నించారు. ''వాళ్లు (బీజేపీ) (BJP) పరిహారం ఇస్తారా?'' అని నిలదీశారు.

2024లో బీజేపీని ఓడించండి..

అరాచకత్వానికి చరమగీతం పాడి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు 2024లో బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ మరోసారి పిలుపునిచ్చారు. బెంగాల్‌లో హింస, అవినీతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితి భేషుగ్గా ఉందన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భయోత్పాతానికి బీఎస్ఎఫ్ పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. సరిహద్దు ప్రాంతాల్లో అమాయకులను చంపుతున్నారని, ఈ హత్యలపై నిజనిర్దారణ బృందాలను పంపడానికి కేంద్రం ఎప్పుడూ ముందుకు రాలేదని విమర్శించారు.

అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్...

కాగా, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రసంగిస్తుండగా స్పీకర్ బిమన్ బోస్ అడ్డుకోవడంతో బీజేపీ నిరసన తెలిపింది. సభ నుంచి సభ్యులు వాకౌట్ చేశారు. సువేందు అధికారి తొలుత తన ప్రసంగంలో గవర్నర్ ప్రసంగంపై విమర్శలు చేశారు. సభ కొద్దిపాటి విరామానంతరం తిరిగి సమావేశమైనప్పుడు సభలో అనుచిత వ్యాఖ్యలు (గవర్నర్‌పై విమర్శలు) చేయవద్దని స్పీకర్ హెచ్చరించారు. దీంతో బీజేపీ సభ్యులు స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ, స్పీకర్‌‌ ఆదేశాలను ఖాతరు చేయని సువేందు అధికారిపై ప్రివిలిజ్ మోషన్ తెచ్చే రైట్ తనకు ఉంటుందని చెప్పారు. సభలో సువేందు అధికారి ప్రవర్తన గర్హనీయమని అన్నారు.

Updated Date - 2023-02-13T18:25:10+05:30 IST