Asaduddin Owasi: ఏళ్ల తరబడి సీఎంగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం చేతకాదా?
ABN , First Publish Date - 2023-04-04T16:29:56+05:30 IST
రామ నవమి శోభాయాత్రల సందర్భంగా పశ్చిమబెంగాల్, బీహార్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండపై...
న్యూఢిల్లీ: రామ నవమి శోభాయాత్రల సందర్భంగా పశ్చిమబెంగాల్ (West Bengal), బీహార్ (Bihar)లో చెలరేగిన అల్లర్లు, హింసాకాండపై ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏఐఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తప్పుపట్టారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు.
''ఏ రాష్ట్రంలో ఎక్కడ హింసాకాండ చెలరేగినా అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. బిహార్‌షరీఫ్‌లోని మదరసా అజిజియాను మంటల్లో తగులబెట్టారు. ముస్లింల దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల వెనుక పక్కా ప్రణాళిక ఉంది. నలందా జిల్లా కల్లోలిత ప్రాంతమని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు బాగా తెలుసు. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు తలెత్తాయి. అయినప్పటికీ ఆయనలో పశ్చాత్తాపం లేదు. నిన్న ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని ముస్లింలను ఎప్పటికీ భయాల్లోనే ఉంచాలని నితీష్, తేజస్వి యాదవ్ కోరుకుంటున్నారు'' అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నితీష్‌పై మరింతగా ఒవైసీ విరుచుకుపడుతూ, ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ తాజా అల్లర్లను ఆపలేకపోడవం ఏమిటని నిలదీశారు. మదరసాని తగులబెట్టడం, మసీదుపై దాడిని ఆపలేకపోవడం పూర్తిగా నితీష్, ఆర్జేడీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బీహార్‌లో ముస్లింల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తగులబెట్టిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు. పశ్చిమబెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, కర్ణాటకలో పశువుల వ్యాపారిని కొట్టి చంపిన ఘటనే కావచ్చు, అక్కడ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని ఒవైసీ ప్రశ్నించారు.