Manipur : మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2023-07-23T12:31:37+05:30 IST

మణిపూర్‌లో పరిస్థితి రాన్రానూ ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. మోదీ నిజమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర సమస్యల గురించి చెప్పడానికి అవకాశం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Manipur : మోదీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

న్యూఢిల్లీ : మణిపూర్‌లో పరిస్థితి రాన్రానూ ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. మోదీ నిజమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర సమస్యల గురించి చెప్పడానికి అవకాశం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే పావోలియెన్లాల్ హవోకిప్ మీడియాతో మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో దాదాపు 79 రోజుల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్పందించడంలో కనీసం ఓ వారం ఆలస్యమైనా చాలా ఎక్కువ సమయమే ఆలస్యమైనట్లు పరిగణించాలని అన్నారు. సుదీర్ఘ మౌనం తర్వాత మోదీ పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రంలోని కుకీ-జోమీ తెగ ప్రతినిధిగా తాను మోదీతో మాట్లాడటానికి ప్రయత్నించానని, ఆయన అమెరికా వెళ్లడానికి ముందు ఆయనను కలవడానికి ప్రయత్నించానని, కానీ ఆయన అపాయింట్‌మెంట్ తనకు లభించలేదని చెప్పారు.

అంతర్జాతీయ సంబంధాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, ప్రజలు మరణిస్తున్న సమయంలో సమస్యను పరిష్కరించవలసిన అవసరం, మానవత్వాన్ని చూపించవలసిన ఆవశ్యకత ఉన్నాయన్నారు. ప్రస్తుతం అది లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆయనకు వివరించేందుకు ఇప్పటికీ ఎదురు చూస్తున్నామని చెప్పారు.

మణిపూర్‌లో తమకు ప్రత్యేక పాలనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరిన పది మంది కుకీ ఎమ్మెల్యేల్లో హవోకిప్ ఒకరు. కుకీలను కాపాడటంలో ఎన్ బిరేన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వీరు ఆరోపించారు. మే 3 నుంచి ప్రారంభమైన హింసాత్మక సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉందని ఆరోపించారు. చిన్-కుకి-మిజో-జోమి గిరిజనులపై హింసకు బిరేన్ సింగ్ ప్రభుత్వం మద్దతిస్తోందని మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్రంలో విభజన ఏర్పడిందని తెలిపారు.

మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి, ఆడియో, వీడియోలు ఉంటేనే మోదీ, ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి దృష్టి సారిస్తారా? అని హవోకిప్ ప్రశ్నించారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన గురించి ఇటీవలే తెలిసిందని బిరేన్ సింగ్ చెప్పడం మసిబూసి మారేడు కాయ చేయడం కోసమేనని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

Mizoram : మెయిటీలకు మిలిటెంట్ల హెచ్చరిక.. మిజోరాం నుంచి మణిపూర్‌ వెళ్లిపోతున్న మెయిటీలు..

Updated Date - 2023-07-23T12:31:37+05:30 IST