Share News

Lakhbir Singh Landa: లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

ABN , Publish Date - Dec 30 , 2023 | 09:07 AM

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ) డైరెక్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూఏపీఏ చట్టం కింద లాండాను హోంశాఖ ఉగ్రవాదిగా పేర్కొంది.

Lakhbir Singh Landa: లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ) డైరెక్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూఏపీఏ చట్టం కింద లాండాను హోంశాఖ ఉగ్రవాదిగా పేర్కొంది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పాకిస్థాన్ నుంచి భారత్‌కు ఆయుధాలు, ఇంప్రూవైజ్జ్ పేలుడు పరికరాల(ఐఈడీ) అక్రమ రవాణాను లాండా పర్యవేక్షిస్తున్నాడు. గత ఏడాది మే 9న మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పీజీ) దాడికి లాండా ప్రధాన సూత్రధారి. మరణించిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF) నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్, గురుపత్వంత్ సింగ్‌తో కూడా లాండాకు సన్నిహిత సంబంధం ఉంది.


పంజాబ్‌లోని టార్న్ తరణ్ జిల్లాలోని హరికే నివాసి అయిన లాండా ప్రస్తుతం కెనడాలోని అల్బెర్టాలోని ఎడ్మాంటన్‌లో ఉన్నాడు. “లఖ్‌బీర్ సింగ్ అలియాస్ లాండా మొహాలీలోని పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్ భవనంపై ఉగ్రదాడిలో పాల్గొన్నాడు. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు సరిహద్దు బయటి నుంచి పేలుడు పరికరాలు (ఐఈడీలు), ఆయుధాలు, అధునాతన ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరాను పర్యవేక్షిస్తున్నాడు’’ అని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలను పెంచడం, దోపిడీలు, హత్యలు, ఐఈడీలను అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పంజాబ్‌తోసహా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద చర్యలకు నిధులు లేదా వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించడం వంటి పలు క్రిమినల్ కేసుల్లో లాండా ప్రమేయం ఉందని హోంశాఖ తెలిపింది. అంతేకాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హత్యలు, దోపిడీలు, ఇతర దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కాగా 2021లో లాండాపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. ఎన్‌ఐఏ అతనిపై రివార్డు కూడా ప్రకటించింది.

Updated Date - Dec 30 , 2023 | 09:07 AM