Manipur violence : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలంటూ మిజోరాంలో నిరసనలు
ABN , First Publish Date - 2023-07-25T16:26:29+05:30 IST
మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్‌లోని జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి.
ఐజ్వాల్ : మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మిజోరాంలో మంగళవారం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్‌లోని జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలు కలిసి మిజోరాం రాజధాని నగరం ఐజ్వాల్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను నిర్వహించాయి.
ఐజ్వాల్‌లో నిర్వహించిన ప్రదర్శనలో మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగ, ఉప ముఖ్యమంత్రి టాన్‌లుయియా, మంత్రులు, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలను నిరసిస్తూ వేలాది మంది సామాన్యులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శన ఇదే కావడంతో ఈ నగరంలో జన జీవనం స్తంభించింది. అధికార పార్టీ ఎంఎన్ఎఫ్ కార్యాలయాలను ఈ నిరసనకు సంఘీభావంగా మూసివేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జోరాం పీపుల్స్ మువ్‌మెంట్ కూడా తమ కార్యాలయాలను మూసివేశాయి.
ఎన్‌జీఓ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఆర్ లాల్న్‌ఘెట మాట్లాడుతూ, భారత దేశం తమను భారతీయులుగా పరిగణిస్తే, తక్షణమే మణిపూర్‌లోని జో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఘర్షణ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని నిరసనకారులు తీర్మానాలు ఆమోదించారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
జో ప్రజలు ఎవరు?
మణిపూర్‌లోని కుకీలతో మిజోరాంలోని మిజోలకు జాతి సంబంధిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కొండల్లో ఉంటున్న కుకీ-చిన్స్, మయన్మార్‌లోని చిన్స్‌తో కూడా మిజోలకు జాతి సంబంధిత సంబంధాలు ఉన్నాయి. వీరందరినీ కలిపి జో తెగ అంటారు.
నిరసనల నేపథ్యంలో మిజోరాంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలతో సహా అన్ని జిల్లాల్లోనూ బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు కాగా, నాగాలు, కుకీలు కలిపి 40 శాతం మంది ఉన్నారు. మెయిటీలు ఇంఫాల్ లోయలో ఉంటారు. నాగాలు, కుకీలు ప్రధానంగా కొండ ప్రాంత జిల్లాల్లో ఉంటారు. మెయిటీలకు షెడ్యూల్డు తెగల హోదా కల్పించాలనే డిమాండ్ ఈ ఘర్షణలకు మూల కారణం. మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ వీడియో బయటపడటంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెప్తోంది.
ఇవి కూడా చదవండి :
CBSE: సీబీఎస్‌ఈలో తెలుగు మాధ్యమం
Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..