Ladakh : దేశ భద్రత కోసం మోదీ మరో కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-02-15T18:57:26+05:30 IST
భారత దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం అత్యంత కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : భారత దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. షింకున్ కనుమ (Shinkun La) క్రింద 4.1 కిలోమీటర్ల పొడవున సొరంగాన్ని నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సొరంగంతోపాటు ఇరువైపులా అప్రోచ్ రోడ్లను కూడా నిర్మిస్తారు. దీనికి రూ.1,681.51 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇది 2025 డిసెంబరునాటికి పూర్తవుతుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మనాలీ-దార్చా-పదమ్-నీము యాక్సిస్‌లో ఈ సొరంగాన్ని నిర్మిస్తారు. దీంతో లడఖ్ కంచుకోటగా మారుతుంది. చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం అనే తేడాలేవీ లేకుండా, అన్ని వేళల్లోనూ ఇక్కడికి రక్షణ దళాలను పంపించడానికి, ఆహారం, ఆయుధాల సరఫరాకు, చైనా, పాకిస్థాన్ దేశాల దుందుడుకు, దుర్మార్గపు చర్యలను తిప్పికొట్టడానికి వీలవుతుంది.
దార్చా-పదమ్-నీము యాక్సిస్‌లో బ్లాక్ టాప్ రోడ్డును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 2019లో నిర్మించింది. సముద్ర మట్టం నుంచి 16,703 అడుగుల ఎత్తులో ఉన్న షింకున్ కనుమలో చలికాలంలో మంచు విపరీతంగా కురుస్తుంది. అందువల్ల ఈ రోడ్డును ఉపయోగించుకోలేకపోతున్నారు. లడఖ్ రక్షణకు ఈ రోడ్డు చాలా ముఖ్యమైనది. పాకిస్థానీ, చైనీస్ లాంగ్ రేంజ్ ఆయుధాలు, క్షిపణుల ఫైరింగ్ రేంజ్ నుంచి దీనికి రక్షణ ఉంటుంది. 2020 మే నెలలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం దుందుడుకు చర్యకు తెగబడినపుడు తూర్పు లడఖ్‌కు ఆయుధాలను పంపేందుకు భారత సైన్యం దార్చా-పదమ్-నీము మార్గాన్ని ఉపయోగించుకుంది. షింకున్ కనుమ క్రింద సొరంగ నిర్మాణానికి అనుమతించడం చాలా వ్యూహాత్మక నిర్ణయమనే చెప్పాలి. దీనివల్ల మనాలీ-ఉప్షి-లేహ్ హైవేపై అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానాన్ని సాధించవచ్చు.
ఇవి కూడా చదవండి :
Hunger Deaths : పక్కింట్లో ఆకలి కేకలు గుర్తించలేని అభివృద్ధి మనది!?
గడ్కరీపై సుప్రియ వ్యాఖ్యల అంతరార్థమేమిటి?