HAL Helicopter Factory: ఫిబ్రవరి 6న మోదీ ప్రారంభం..ఆత్మనిర్భర్ భారత్‌లో మరో ముందడుగు

ABN , First Publish Date - 2023-02-04T15:27:30+05:30 IST

రక్షణరంగంలో ఆత్మనిర్భరత దిశగా మరో ముందడుగు పడుతోంది. కర్ణాటకలోని..

HAL Helicopter Factory:  ఫిబ్రవరి 6న మోదీ ప్రారంభం..ఆత్మనిర్భర్ భారత్‌లో మరో ముందడుగు

న్యూఢిల్లీ: రక్షణరంగంలో ఆత్మనిర్భరత (Aatmanirbharata in defence) దిశగా మరో ముందడుగు పడుతోంది. కర్ణాటకలోని తుంకూరు (Tumakuru)లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) హెలికాప్టర్ ఫ్యాక్టరీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

దేశంలోని అన్ని హెలికాప్టర్ల అవసరాలను తీర్చే 'ఒన్ స్టాప్ సొల్యూషన్‌' లక్ష్యంగా 615 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ సౌకర్యాలు కలిగిన ఈ ఫ్యాక్టరీలో తొలుత 'లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు' (ఎల్‌హెచ్‌యూ) తయారు చేయనున్నారు. ఈ హెల్‌యూహెచ్‌లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి, 3-టన్ క్లాస్, సింగిల్ ఇంజన్ మల్టీపర్సర్ యుటిలిటీ హెలికాప్టర్‌గా అభివృద్ధి చేయనున్నారు. తొలుత ఏటా 30 హెలికాప్టర్ల వరకూ తయారు చేసి, దశలవారిగా ఏడాదికి 60 నుంచి 90 వరకూ తయారు చేస్తారు. తొలి ఎల్‌యూహెచ్‌కు ఫ్లైట్ టెస్ట్ పూర్తి చేసి, ఆవిష్కరణకు సిద్ధం చేశారు.

ఈ ఫ్యాక్టరీలో క్రమంగా లైట్ కంబాట్ హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్), ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్లు (ఐఎంఆర్‌హెచ్)లను సైతం తయారు చేయనున్నారు. అదేవిధంగా మెయింటనెన్స్, రిపైర్‌ వంటివి చేపడతారు. సివిల్ ఎల్‌యూహెచ్‌ల ఎగుమతులు కూడా చేపట్టనున్నారు. రాబోయే 20 ఏళ్లలో 3 నుంచి 15 టన్నుల రేంజ్‌లో 1,000కి పైగా విమానాలను తయారు చేయడం ద్వారా 4 లక్షల కోట్ల వ్యాపారానికి హెచ్ఎల్ఏ ప్లాన్ చేస్తోంది. దీనికితోడు సీఆర్ఎస్ కార్యకలాపాలు, కమ్యూనిటీ సెంట్రిక్ కార్యక్రమాల్లోనూ కంపెనీ గణనీయంగా పెట్టుబడులు పెట్టడం వల్ల తుంకూరు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాథి అవకాశాలు కలుగుతాయి. ఫలితంగా ఆ ప్రాంత ప్రజల జీవినవిధానం మరింత మెరుగుపడనుంది. స్కూళ్లు, కాలేజీలు, రెసిడెన్షియల్ ఏరియాల్లో స్కిల్, ఇన్‌ఫ్రాస్టక్చర్ డవలప్‌మెంట్ చోటుచేసుకుంటుంది. సమీప ప్రాంతాల వారికి మరిన్ని వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

హెలి-రన్ వే, ఫ్లైట్ హ్యాంగర్, ఫైనల్ అసెంబ్లీ హ్యాంగర్, స్ట్రక్చర్ అసెంబ్లీ హ్యాంగర్, ఎయిర్ కంట్రోల్, వివిధ సపోర్టింట్ సర్వీస్ సౌకర్యుల కల్పనతో హెచ్ఏఎల్ ఫ్యాక్టరీ సిద్ధమవుతోంది. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.

Updated Date - 2023-02-04T16:45:55+05:30 IST