Manipur : మణిపూర్‌లో మహిళల ఊరేగింపు.. ఏ నాగరికతకైనా ఇది సిగ్గుచేటు అని మోదీ ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-07-20T11:23:34+05:30 IST

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘాటుగా స్పందించారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు.

Manipur : మణిపూర్‌లో మహిళల ఊరేగింపు.. ఏ నాగరికతకైనా ఇది సిగ్గుచేటు అని మోదీ ఆగ్రహం..
Narendra Modi

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గురువారం ఘాటుగా స్పందించారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు. ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు అని స్పష్టం చేశారు. ఇది దేశానికి అవమానకరమని చెప్పారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదన్నారు.

ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మోదీ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఈ భరోసా ఇచ్చారు.

మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ పరిస్థితిపై మాట్లాడకపోతే, పార్లమెంటులో అంతరాయాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ‘మన్ కీ బాత్ ఇక చాలునని, మణిపూర్ గురించి మాట్లాడవలసిన సమయం వచ్చిందని అన్నారు.

ఇదిలావుండగా, గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.

మరోవైపు, మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యం కేసుపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. టీఎంసీ

Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..

Updated Date - 2023-07-20T11:23:34+05:30 IST