Sharad Pawar: రాజీనామా ఉపసంహరించుకున్న పవార్... అయినా మళ్లీ మొదటికొచ్చిన వివాదం

ABN , First Publish Date - 2023-05-05T19:28:55+05:30 IST

ఇటీవల చేసిన రాజీనామాను శరద్ పవార్ (Sharad Pawar withdraws his resignation) ఉపసంహరించుకున్నారు. అయితే వివాదం మాత్రం సద్దుమణగలేదు.

Sharad Pawar: రాజీనామా ఉపసంహరించుకున్న పవార్... అయినా మళ్లీ మొదటికొచ్చిన వివాదం
Sharad Pawar withdraws his resignation

ముంబై: ఎన్సీపీ (Nationalist Congress Party) అధినేత పదవికి ఇటీవల చేసిన రాజీనామాను శరద్ పవార్ (Sharad Pawar withdraws his resignation) ఉపసంహరించుకున్నారు. అయితే వివాదం మాత్రం సద్దుమణగలేదు. రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించేందుకు ముంబైలో (Mumbai) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేత, పవార్ సమీప బంధువు అజిత్ పవార్ (Ajit Pawar) లేరు. దీంతో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీలో జరుగుతున్న అనూహ్య పరిణామాల వల్లే శరద్ పవార్ రాజీనామా చేశారని పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేయడంతో పెద్దాయన మెత్తబడ్డారు. రాజీనామా ఉపసంహరించుకున్నారు. అయితే తన రాజీనామా ఉపసంహరణ విషయాన్ని చెప్పటానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ లేకపోవడంపై కొత్త కథనాలు మొదలయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.

వాస్తవానికి బీజేపీ-ఎన్సీపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటు కాబోతోందని, అజిత్ పవార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశముందని ఇటీవలే వార్తలు వచ్చాయి. అజిత్ పవార్ ఒక్కడే వెళ్లడం కాకుండా తనతో పాటు మెజార్టీ ఎన్సీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుపోవాలని నిర్ణయించినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై శరద్ పవార్ నొచ్చుకున్నట్లు అందుకే రాజీనామా చేసినట్లు జాతీయమీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే రాజీనామాను వెనక్కు తీసుకోవాలని స్వయంగా అజిత్ పవార్ కోరడం కొసమెరుపుగా మారింది. అయితే ఆయన మళ్లీ విలేకరుల సమావేశంలో లేకపోవడంతో మీడియా కథనాలకు బలం ఏర్పడింది.

ఏక్‌నాథ్‌ షిండే– ఉద్దవ్‌ ఠాక్రే వర్గాల్లో అసలైన శివసేన ఎవరిదనే విషయంపై సుప్రీంకోర్టు తన తీర్పును మార్చి 16న రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ తీర్పు ఫలితం వచ్చే అవకాశాలున్నాయి, ఒక వేళ షిండే వర్గం ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసినా, యథాతథ స్థితి పునరుద్దరించాలని చెప్పినా షిండే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అజిత్‌ పవార్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. కమలనాథులతో కలిసి అధికారం చేపట్టే అవకాశం ఉన్నప్పుడు చేజేతులా ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని మెజారిటీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు భావిస్తుండడంతో శరద్‌ పవార్‌ తప్పని పరిస్థితుల్లోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, తాను అధ్యక్షుడుగా ఉండగా పార్టీ బీజేపీతో చేతులు కలిపిందన్న అభిప్రాయం రాకుండా ఉండేందుకే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

తన రాజీనామా ద్వారా ఎన్సీపీ ఎమ్మెల్యేలెవ్వరూ అజిత్ పవార్‌తో వెళ్లొద్దని శరద్ పవార్ చెప్పి ఉంటారని, తామెవ్వరమూ వెళ్లడం లేదని వారంతా చెప్పాకే పెద్దాయన రాజీనామా ఉపసంహరించుకుని ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం కుర్చీపై కన్నేసిన అజిత్ పవార్ మనసులో ప్రస్తుతం ఏం మెదలుతుందో అంచనావేయడం కష్టమేనంటున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఎన్సీపీ రాజకీయాలు మరో మలుపు తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.

Updated Date - 2023-05-05T19:44:01+05:30 IST