NCP Crisis: శరద్ పవార్‌కు కాంగ్రెస్ సంఘీభావం, ఎంవీఏ రాష్ట్రవ్యాప్త పర్యటన..!
ABN , First Publish Date - 2023-07-04T16:44:59+05:30 IST
నేషలిస్టు కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు మహావికాస్ కూటమి భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. క్యాడర్‌ను ఉత్సాహ పరచేందుకు ఎంవీఏ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టాలని కాంగ్రెస్ చీఫ్ నానాపటోలే ప్రతిపాదించారు.
ముంబై: నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)లో సంక్షోభం నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad pawar)కు మహావికాస్ కూటమి (Maha Vikas Aghadi-MVA) భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ (Congress) సంఘీభావం తెలిపింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే (Nana Patole) సారథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శరద్ పవార్‌ను ముంబైలోని వైబీ చవాన్ కార్యాలయంలో మంగళవారంనాడు కలుసుకున్నారు. బీజేపీ-శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంవీఏ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహం నింపాలని, ఎంవీఏ ఐక్యంగా ఉందనే స్పష్టమైన సంకేతాలివ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన చేశారు.
ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఈనెల 2న శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరడం, ఉపముఖ్యమంత్రిగా ఆయన, మంత్రులుగా మరో 8 మంది ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఎన్సీపీ నిట్టనిలువుగా చీలింది. అయితే, ఎన్‌సీపీ తనతోనే ఉందని, పార్టీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేలలో 40 మంది తనతోనే ఉన్నారని అజిత్ పవార్ మంగళవారంనాడు క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో చెప్పారు.
ఎంవీఏ రాష్ట్ర వ్యాప్త పర్యటన
కాగా, ఎంవీఏ ఐక్యతకు ఎలాంటి ఢోకా లేదని శరద్ పవార్‌తో సమావేశానంతరం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానాపటోలే మీడియాకు తెలిపారు. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేతో కలిసి మహారాష్ట్ర టూర్‌కు ప్లాన్ చేస్తున్నామని, దీనిపై ఉద్ధవ్ థాకరేతో శరద్ పవార్ మాట్లాడతారని చెప్పారు. అసెంబ్లీలో విపక్ష నేత ఎవరనే దానిపై పవార్, ఉద్ధవ్‌తో సంప్రదిస్తున్నామని తెలిపారు.