Jitendra Awhad: ఎన్‌సీపీ నేత జితేంద్ర అవధ్ రాజీనామా.. పార్టీలో ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2023-05-03T17:01:36+05:30 IST

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నట్టు శరద్ పవార్ చేసిన ప్రకటనతో ఆ పార్టీలో తలెత్తిన ప్రకంపనలు ఆగడం లేదు. ఎన్‌సీపీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవధ్..

Jitendra Awhad: ఎన్‌సీపీ నేత జితేంద్ర అవధ్ రాజీనామా.. పార్టీలో ఏం జరుగుతోంది?

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ‌ (NCP) అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నట్టు శరద్ పవార్ (Sharad Pawar) చేసిన ప్రకటనతో ఆ పార్టీలో తలెత్తిన ప్రకంపనలు ఆగడం లేదు. ఎన్‌సీపీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవధ్ (Jitendra Awhad) బుధవారంనాడు తన పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని ఆయన ఓ ట్వీట్‌లో తెలియజేశారు.

''పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేశాను. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌కు నా రాజీనామా పత్రాన్ని పంపాను. పవార్ రాజీనామా ప్రకటించగానే థానే ఎన్‌సీపీ ఆఫీసు బేరర్లందరూ కూడా రాజీనామా చేశారు'' అని జింతేంద్ర అవధ్ ఆ ట్వీట్‌లో తెలిపారు.

కాగా, ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంలో ఎన్‌సీపీ సీనియర్ నేతలు బుధవారంనాడు ముంబైలో కీలక సమావేశం నిర్వహించారు. శరద్ పవార్‌తో పాటు అజిత్ పవార్, సుప్రియ సులే, ప్రఫుల్ పటేల్, ఇతర ఎన్‌సీపీ నేతలు ఇందులో పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఉత్కంఠ..

శరద్ పవార్ మంగళవారంనాడు తన ఆటోబయోగ్రఫీ రివైజ్డ్ వైర్షన్ కార్యాక్రమంలో ఎన్‌సీపీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, నేతలు వెంటనే పట్టుబడ్డారు. కొందరు కంటతడి పెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా ఇంకా తనకు మూడేళ్ల వ్యవధి ఉందని, ఈ వ్యవధిలో తాను మహారాష్ట్రతో పాటు దేశంలోని ప్రధాన అంశాలపై దృష్టిసారిస్తానని పవార్ తెలిపారు. 1960 మే 1 నుంచి 2023 మే 1వ తేదీ వరకూ సుదీర్ఘమైన ప్రజాజీవనం గడిపానని, ఇక ఒక అడుగు తగ్గడం తప్పనిసరని పవార్ అన్నారు. ఆ కారణంగానే ఎన్‌సీపీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాగా, పవార్ ప్రకటన తెలిసిన వెంటనే కార్యకర్తలు ముంబైలో నిరసనలు దిగారు. రాజీనామాల పర్వం కూడా మొదలైంది. అజిత్ పవార్, సుప్రియా సులే తదితర నేతలు పవార్‌తో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తన నిర్ణయాన్ని పునరాలోచించుకునేందుకు పవార్ అంగీకరించారని, ఇందుకు రెండు, మూడు రోజులు సమయం తీసుకోనున్నారని ఆందోళనకు దిగిన పార్టీ కార్యకర్తలకు అజిత్ పవార్ నచ్చచెప్పారు. మరోవైపు, పవార్ నిర్ణయంతో ఎన్‌సీపీ చీఫ్ పగ్గాలు ఎవరు చేపట్టనున్నారనే దానిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్, సుప్రియా సులే పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పవార్‌తో పార్టీ నేతల కీలక సమావేశం జరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం వెలువడనుందనే ఉత్కంఠ ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది

Updated Date - 2023-05-03T17:01:36+05:30 IST