Air India : ఏయిరిండియా విమానంలో నేపాల్ జాతీయుడి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు..
ABN , First Publish Date - 2023-07-12T10:35:31+05:30 IST
సదుపాయాలను హుందాగా వినియోగించుకోవలసిన విమాన ప్రయాణికులు ఈమధ్య అనుచితంగా ప్రవర్తిస్తూ, తోటి ప్రయాణికులకు, సిబ్బందికి తలనొప్పిగా మారుతున్నారు. పక్కనున్నవారిపై మూత్ర విసర్జన చేయడం, దాడులకు తెగబడటం వంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. తాజాగా ఓ నేపాలీ జాతీయుడు ఎయిరిండియా విమానం సిబ్బందిని దూషించి, లావేటరీ డోర్‌ను విరిచేశారు.
న్యూఢిల్లీ : సదుపాయాలను హుందాగా వినియోగించుకోవలసిన విమాన ప్రయాణికులు ఈమధ్య అనుచితంగా ప్రవర్తిస్తూ, తోటి ప్రయాణికులకు, సిబ్బందికి తలనొప్పిగా మారుతున్నారు. పక్కనున్నవారిపై మూత్ర విసర్జన చేయడం, దాడులకు తెగబడటం వంటి సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. తాజాగా ఓ నేపాలీ జాతీయుడు ఎయిరిండియా విమానం సిబ్బందిని దూషించి, లావేటరీ డోర్‌ను విరిచేశారు. టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేబిన్ సూపర్‌వైజర్ ఆదిత్య కుమార్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లో తెలిపిన వివరాల ప్రకారం, నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్ టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణించారు. ఆయన తనకు కేటాయించిన సీటు కాకుండా వేరొక సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత విమానం సిబ్బందితో ఘర్షణకు దిగి, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మహేశ్ పండిట్ తమను దూషిస్తూ, అనుచితంగా ప్రవర్తించారని పైలట్ ఇన్ కమాండ్‌కు తాము చెప్పామని, వెంటనే ఆయనకు హెచ్చరిక జారీ చేశారని, దీంతో ఆయన తన దుర్వర్తనను ఆపారని ఆదిత్య కుమార్ చెప్పారు. కొద్ది సేపటి తర్వాత స్మోక్ అలర్ట్ వచ్చిందని, తాము పరిశీలించి చూసినపుడు, మహేశ్ లావేటరీలో సిగరెట్ లైటర్‌తో పట్టుబడ్డారని చెప్పారు. మహేశ్ ముందు ఉన్న డోర్‌ను తాను తెరిచానని, అప్పుడు ఆయన తనను వెనుకకు నెట్టేసి, పరుగు పరుగున వెళ్లి తన సీటు 26ఎఫ్‌లో కూర్చున్నారని తెలిపారు. తాను ఆయనను ఆపేందుకు ప్రయత్నించానని, అప్పుడు కూడా ఆయన తనను తోసేసి, తనను దూషించారని చెప్పారు. అనంతరం ఆయన లావేటరీ డోర్‌ను విరిచేశారన్నారు. ఈ విషయాన్ని తాను వెంటనే కెప్టెన్‌కు చెప్పానన్నారు. కెప్టెన్ ఆదేశాల మేరకు తాను, కేబిన్ క్రూ పునీత్ శర్మ, మరో నలుగురు ప్రయాణికులతో కలిసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఆయనను నిలువరించేందుకు ప్రయత్నించామన్నారు. మరో పది మంది ప్రయాణికుల సహాయంతో ఆయనను నిలువరించగలిగినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆయన తోటి ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించారన్నారు.
ఢిల్లీ పోలీసులు మహేశ్ పండిట్‌పై ఐపీసీ సెక్షన్లు 323, 506, 336; ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 22, 23, 25 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
Former Minister: ఆదాయానికి మించి ఆస్తులు.. మాజీ మంత్రిపై ఛార్జీషీటు దాఖలు
Collegium system : కొలీజియం వ్యవస్థపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు