Share News

INDIA: ఇండియా కూటమి సమావేశానికి నితీష్, అఖిలేష్ డుమ్మా?

ABN , First Publish Date - 2023-12-05T14:13:23+05:30 IST

డిసెంబర్ 6న జరిగే ఇండియా కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో వీరిద్దరు పాల్గొనకపోవచ్చు.

INDIA: ఇండియా కూటమి సమావేశానికి నితీష్, అఖిలేష్ డుమ్మా?

ఢిల్లీ: డిసెంబర్ 6న జరిగే ఇండియా కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో వీరిద్దరు పాల్గొనకపోవచ్చు. "సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రేపు జరిగే భారత కూటమి సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ లేదా జాతీయ అధ్యక్షునిచే అనుమతి పొందిన మరే ఇతర నాయకుడు సమావేశంలో పాల్గొంటారు." అని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి జాతీయ మీడియాకు తెలిపారు. అలాగే నితీష్ కుమార్‌కు బదులుగా జేడీయూ పార్టీ చీఫ్ లాలన్ సింగ్ లేదా బీహార్ జలవనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా సమావేశానికి హాజరుకానున్నారని సమాచారం.


కాగా 2024 లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాలను రూపొందించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతిపక్ష కూటమిలోని(ఇండియా) నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం జరిగే ఈ సమావేశంలో ఎన్నికలకు ముందు బీజేపీని సమిష్టిగా ఎదుర్కొవడానికి అమలు చేయాల్సిన ప్రణాళికంపై చర్చించి ఖరారు చేయాలని భావిస్తున్నారు. కాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ ప్రతిపక్ష కూటమి సమావేశానికి హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఏకంగా ముగ్గురు పెద్ద నేతలు సమావేశానికి డుమ్మా కొడుతుండడంతో ఇండియా కూటమిలో అప్పుడే విభేదాలు మొదలయ్యాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవల విడుదలైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీనే అధికారాన్ని చేజిక్కించుకుంది. ఒక తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. చిన్న రాష్ట్రమైన మిజోరంలో ప్రాంతీయ పార్టీ జడ్‌పీఎం అధికారాన్ని సాధించింది. మధ్యప్రదేశ్‌తోపాటు తమ సిట్టింగ్ రాష్ట్రాలైనా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా కాంగ్రెస్ ఓటమిపాలైంది. ప్రస్తుతం ఉత్తరాన కాంగ్రెస్ పార్టీ ఒక హిమాచల్‌ప్రదేశ్‌లోనే అధికారంలో ఉంది. దేశం మొత్తంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే సొంతంగా పాలిస్తోంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని బీహార్, జార్ఖండ్‌లో కూడా అధికారంలో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-05T14:22:20+05:30 IST