Karnataka Election 2023 : పోలింగ్ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-05-10T12:27:58+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. కింగ్‌మేకర్ స్థానాన్ని
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. కింగ్‌మేకర్ స్థానాన్ని పదిలపరచుకోవడం కోసం జేడీఎస్ ప్రయత్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయా? అని అడిగినపుడు, అలాంటి అవకాశాలేవీ లేవన్నారు. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) తాను పోటీ చేస్తున్న వరుణ నియోజకవర్గంలో ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తనకు ఓటర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. తనకు 60 శాతం కన్నా ఎక్కువ ఓట్లు లభిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, భవిష్యత్తులో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, అయితే రాజకీయాల నుంచి విరమించుకోబోనని తెలిపారు. పని చేసే పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరినట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల్లో ఇమిడి ఉన్నట్లు తెలిపారు.
కుమార స్వామి పిలుపు
మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి రామనగరలోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సరైన అభివృద్ధి జరగాలంటే జేడీఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్నామని చెప్పారు. మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ మైసూరులోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటర్లు బయటకురావాలని, ఓటు వేసి, తమకు నచ్చిన మంచి నాయకుడిని మంచి ప్రజాస్వామ్యం కోసం ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో మనమంతా పాలుపంచుకోవాలన్నారు.
‘బీజేపీకి 140 స్థానాలు’
బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కర్ణాటక ఓటర్లు బీజేపీకి మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పార్టీకి సుమారు 140 స్థానాలు లభిస్తాయని, తమకు సంపూర్ణ ఆధిక్యత వస్తుందని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ ముస్లింలను మచ్చిక చేసుకుని, బుజ్జగించడానికి ప్రయత్నించాయన్నారు. పీఎఫ్ఐ వంటి దేశ వ్యతిరేక సంస్థలకు మద్దతిచ్చేవారు కాంగ్రెస్ వెంట ఉన్నారన్నారు. ఆయన శివమొగ్గలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్‌తో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
‘కాంగ్రెస్‌కు 125 స్థానాలు’
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీశ్ షెట్టార్ కూడా ఓటు వేశారు. కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 125కుపైగా స్థానాలు లభిస్తాయన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారని, అయితే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలిపారు.
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు వంట గ్యాస్ సిలిండర్‌కు పూలమాలలు వేసి, ఊదొత్తులు వెలిగించి, పెరిగిన ధరలను ప్రజలకు గుర్తు చేశారు. నటుడు ఉపేంద్ర రావు బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నడ నటుడు రమేశ్ అరవింద్ బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
224 స్థానాలున్న కర్ణాటక శాసన సభకు మే 10న జరుగుతున్న పోలింగ్‌లో ఉదయం 11 గంటల సమయానికి 20.99 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Karnataka Election : ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. : ప్రముఖులు
Bajrang Dal row : మూర్ఖత్వానికి ఉదాహరణ.. కాంగ్రెస్‌పై నిర్మల సీతారామన్ ఆగ్రహం..