Asaduddin Owaisi: ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ అంశంపై ఒవైసీ ఫైర్.. ఇది ప్రజాస్వామ్యానికి వినాశకరం

ABN , First Publish Date - 2023-09-03T16:44:57+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ (జమిలీ ఎన్నికలు) అంశంపై కసరత్తు చేస్తుండగా.. విపక్షాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పుడు ఏఐఎంఐఎం అధినేత...

Asaduddin Owaisi: ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ అంశంపై ఒవైసీ ఫైర్.. ఇది ప్రజాస్వామ్యానికి వినాశకరం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ (జమిలీ ఎన్నికలు) అంశంపై కసరత్తు చేస్తుండగా.. విపక్షాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పుడు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం దీనిపై మండిపడ్డారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనేది ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థకు వినాశకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరీ చూస్తుంటే.. ఇప్పటికే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందని ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారు.


ట్విటర్ మాధ్యమంగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంశాన్ని పరిశీలించే కమిటీ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఒవైసీ షేర్ చేస్తూ.. ‘‘ఈ నోటిఫికేషన్‌ని బట్టి చేస్తే, ఇది కేవలం ఫార్మాలిటీ కోసమేనని అనిపిస్తోంది. ‘ఒకే దేశం - ఒకే ఎన్నికలు’ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశం బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదానికి వినాశకరమైనవి’’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ‘గ్యాస్’ ధరలను తగ్గించారన్నారు. ఒకవేళ మోదీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే.. మరో ఐదేళ్ల పాటు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

మరో ట్వీట్‌లో.. కమిటీలోని ఇతర సభ్యులు ప్రభుత్వ అనుకూల అభిప్రాయాలను కలిగి ఉన్నారని, వాళ్లు పదే పదే చేస్తున్న బహిరంగ వ్యాఖ్యల ద్వారా ఇది స్పష్టమవుతోందని ఒవైసీ పేర్కొన్నారు. అయితే.. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ ప్రతిపాదనను అమలు చేయాలంటే.. ముందుగా భారత రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికరణలు, అనేక చట్టబద్ధమైన చట్టాలను సవరించవలసి ఉంటుందని సూచించారు. ఈ ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరలిజం ప్రాథమిక స్వభావానికి విరుద్ధమని విరుచుకుపడ్డారు. ఈ అంశంపై నియామక కమిటీ చేస్తున్న పని ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకమైందని.. ఇదొక డమ్మీ కసరత్తు అని సెటైర్లు వేశారు.

Updated Date - 2023-09-03T17:02:58+05:30 IST