Modi France Visit : ఫ్రాన్స్‌లో భారతీయ కరెన్సీలో యూపీఐ చెల్లింపులు.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు.. : మోదీ
ABN , First Publish Date - 2023-07-14T09:29:04+05:30 IST
మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను ఫ్రాన్స్‌లో కూడా వినియోగించుకునే అవకాశం లభించింది. భారతీయ పర్యాటకులు భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫ్రాన్స్‌లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
పారిస్ : మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను ఫ్రాన్స్‌లో కూడా వినియోగించుకునే అవకాశం లభించింది. భారతీయ పర్యాటకులు భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫ్రాన్స్‌లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. మరోవైపు ఫ్రాన్స్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాభ్యాసం అనంతరం అక్కడే ఐదేళ్లపాటు పని చేసే అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాల జారీకి కూడా ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం ఈ వివరాలను వెల్లడించారు.
పారిస్‌లో భారతీయ మూలాలుగలవారిని ఉద్దేశించి మోదీ గురువారం మాట్లాడుతూ, భారత దేశ యూపీఐ మార్కెట్ విస్తరణకు గొప్ప ఊపు వచ్చిందని చెప్పారు. యూపీఐని ఫ్రాన్స్‌లో ఉపయోగించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని, రానున్న రోజుల్లో దీనిని ఫ్రాన్స్‌లో ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఫ్రాన్స్‌లో పర్యటించే భారతీయ పర్యాటకులు భారతీయ కరెన్సీలోనే చెల్లింపులు జరపవచ్చునని చెప్పారు. ఈ సదుపాయం ఈఫిల్ టవర్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.
భారత దేశంలో యూపీఐ సేవలను అందిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఫ్రాన్స్‌లోని ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ (వేగవంతమైన, భద్రతతో కూడిన ఆన్‌లైన్ చెల్లింపుల విధానం) లైరా (Lyra)తో ఓ సంవత్సరం క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగానే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
పోస్ట్ స్టడీ వీసా పొడిగింపు
ఫ్రాన్స్‌లో చదివే భారతీయ విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు వర్క్ వీసా ఇవ్వాలని గతంలో నిర్ణయించారని, ఇకపై ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసే విద్యార్థినీ, విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఐదేళ్ల వర్క్ వీసాను పొందుతారని మోదీ చెప్పారు.
మర్సీల్లేలో కొత్త కాన్సులేట్
ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారంతో మర్సీల్లేలో కొత్తగా భారతీయ కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని భారత దేశం నిర్ణయించిందని చెప్పారు. అక్కడ నివసిస్తున్న భారతీయులకు లభిస్తున్న సౌకర్యాలను మెరుగుపరచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సాంస్కృతిక సంబంధాలు
‘‘దాదాపు 40 ఏళ్ల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫ్రాన్స్‌కు చెందిన సాంస్కృతిక కేంద్రం అలయెన్స్ ఫ్రాంకాయీస్‌ను ప్రారంభించారు, దీనిలో మొట్టమొదటి భారతీయ సభ్యుడు ఇప్పుడు మీ ముందు నిల్చుని మాట్లాడుతున్నాడు’ అని చెప్పారు. ఈ కేంద్రంలోని పాత రికార్డుల నుంచి తన ఐడెంటిటీ కార్డును తీసి, దాని ఫొటోకాపీని తనకు ఇవ్వడానికి భారత ప్రభుత్వం చాలా కృషి చేసిందని తెలిపారు. ఫ్రాన్స్‌తో తన అనుబంధం చరిత్రాత్మకమైనదని, తాను ఎన్నడూ ఆ విషయాన్ని మర్చిపోనని తెలిపారు.
కైలియన్ ఎంబాపే అభిమానులు భారత్‌లోనే ఎక్కువ
ఫ్రెంచ్ ఫుట్‌బాలర్ కైలియన్ ఎంబాపే (Kylian Mbappe)కు తన స్వదేశంలో కన్నా ఎక్కువ అభిమానులు భారత దేశంలోనే ఉన్నారని మోదీ చెప్పారు. భారతీయ యువతలో ఆయన సూపర్‌హిట్ అని చెప్పారు. ఆయనను తెలిసినవారు ఫ్రాన్స్‌లోకన్నా బహుశా భారత దేశంలోనే ఎక్కువ మంది ఉంటారన్నారు.
ఇవి కూడా చదవండి :
Rowdy sheeters: రాష్ట్రంలో మొత్తం రౌడీ షీటర్ల సంఖ్య ఎంతో తెలిస్తే...