Share News

Asaduddin Owaisi: రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ఓటర్లకు ప్రధాని మోదీ హీరో.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-23T16:21:34+05:30 IST

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల పోరులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లను...

Asaduddin Owaisi: రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ఓటర్లకు ప్రధాని మోదీ హీరో.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల పోరులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లను టార్గెట్ చేసి ధ్వజమెత్తారు. రాహుల్, అశోక్ గెహ్లాట్‌ల ఓటర్లందరూ ప్రధాని మోదీని తమ హీరోగా భావిస్తున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. తాను ఓట్లు చీల్చడానికే వచ్చానని వస్తున్న ఆరోపణలపై కూడా ఘాటుగానే బదులిచ్చారు.


జైపూర్‌లో నిర్వహించిన ఒక సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీని ఓడించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అయితే, మోదీ మళ్లీ ప్రధాని అవ్వకూడదన్నది కూడా నా లక్ష్యం’’ అని అన్నారు. తాను తొలిసారి రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నానని తెలిపారు. అయితే.. తన వల్ల ఓట్లు చీలుతాయని తనపై ఆరోపణలు చేస్తున్నారని, మరి తాను పోటీ చేయని రోజుల్లో బీజేపీ ఇక్కడ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఎంపీలందరూ బీజేపీ నుంచి ఎలా ఎన్నికయ్యారని నిలదీశారు. దీనికి కాంగ్రెస్ వద్ద సమాధానం ఉండదని చురకలంటించారు.

మీరందరూ బీజేపీకి ఓటు వేశారా? అని రాజస్థాన్‌లోని ప్రజల్ని అడిగితే, సమాధానం చెప్పడానికి ఎవరూ ముందుకు రారని ఒవైసీ పేర్కొన్నారు. అలాంటప్పుడు గత ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచిందన్నారు. రాహుల్, అశోక్ గెహ్లాట్‌ల ఓటర్లు ప్రధాని మోదీని తమ హీరోగా భావిస్తున్నారని, ఆ ఓటర్లే మోదీకి ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన ఓటర్లను కోల్పోతోందని, అందుకు వాళ్లే బాధ్యులంటూ ఒవైసీ తన అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తపరిచేందుకు ప్రయత్నించారు.

Updated Date - 2023-10-23T16:21:39+05:30 IST