AIIMS Darbhanga : తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మధ్య మాటల యుద్ధం

ABN , First Publish Date - 2023-08-13T12:09:55+05:30 IST

బిహార్‌లోని దర్భంగలో AIIMS ఏర్పాటుపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఘాటుగా బదులిచ్చారు.

AIIMS Darbhanga : తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మధ్య మాటల యుద్ధం
Tejaswi Yadav, Mansukh Mandaviya

న్యూఢిల్లీ : బిహార్‌లోని దర్భంగలో అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) ఏర్పాటుపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) ఘాటుగా బదులిచ్చారు.

ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్ పంచాయతీరాజ్ పరిషత్ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దర్భంగా ఎయిమ్స్ గురించి ప్రస్తావించారు. వైద్య చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ప్రముఖ వైద్య సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తేజస్వి యాదవ్ దీనిపై స్పందిస్తూ, మోదీ పచ్చి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. ‘‘నేను ఆయన ప్రసంగాన్ని విన్నాను. దర్బంగ ఎయిమ్స్‌ను ఎలా ప్రారంభించినదీ ఆయన చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. మాట్లాడటానికి ముందు విషయాలను తెలుసుకోవాలని ప్రధానిని కోరుతున్నాను. అబద్ధాలు మాట్లాడటం ఆయనకు తగినది కాదు. దర్భంగ సిటీలో ఎయిమ్స్ లేదనే విషయం అందరికీ తెలుసు’’ అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చొరవ తీసుకుని దర్భంగలో కొంత భూమిని కేటాయించారన్నారు. ఓ జాతీయ రహదారికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ భూమి ఉందన్నారు. అయితే అది అనుకూలమైనది కాదని కేంద్రం మోకాలు అడ్డు పెట్టిందని ఆరోపించారు. కేంద్రం అకస్మాత్తుగా ఎందుకు మనుసు మార్చుకుందోనని నిస్పృహ వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు తాను రాసిన లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.


మన్‌సుఖ్ మాండవీయ శనివారం ఇచ్చిన వరుస ట్వీట్లలో, ప్రధాని మోదీ అభివృద్ధి రాజకీయాలను విశ్వసిస్తారని, అభివృద్ధి విషయంలో రాజకీయాలను విశ్వసించబోరని చెప్పారు. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని సమకూర్చాలని తేజస్వి యాదవ్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉందన్నారు. దర్భంగ ఎయిమ్స్ కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబరు 19న అనుమతి ఇచ్చిందన్నారు. బిహార్ ప్రభుత్వం మొదటిసారి 2021 నవంబరు 3న భూమిని చూపించిందని చెప్పారు. మీరు (తేజస్వి) పదవిని చేపట్టిన తర్వాత రాజకీయాలు చేస్తూ, 2023 ఏప్రిల్ 30న ఆ భూమిని మార్చారని, మరొక భూమిని చూపించారని గుర్తు చేశారు. ఈ భూమిని నిపుణుల కమిటీ పరిశీలించిందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023 మే 26న బిహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసిందని, రెండోసారి ఇచ్చిన భూమి ఎయిమ్స్ నిర్మాణానికి అనువైనది కాదని చెప్పిందని తెలిపారు. ఈ లేఖ నకలును ఈ ట్వీట్లకు జత చేశారు. భూమిని ఎందుకు మార్చారు? ఎవరి ప్రయోజనాల కోసం మార్చారు? ఎయిమ్స్ నిర్మాణానికి అనువుగా లేని భూమి గురించి బిహార్ శాసన సభలో మీ సొంత ఎమ్మెల్యే ఏం అన్నారు? చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల నుంచి బయటకు వచ్చి, వెంటనే ఎయిమ్స్ నిర్మాణానికి తగిన భూమిని కేటాయించాలని కోరారు. బిహార్‌లో ఎయిమ్స్ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి :

Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

Updated Date - 2023-08-13T12:09:55+05:30 IST