Mann Ki Baat : ఎన్‌టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2023-05-28T14:37:18+05:30 IST
నవరస నటనా సార్వభౌముడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు
న్యూఢిల్లీ : నవరస నటనా సార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్‌టీఆర్ సినిమాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలను పోషించి, కోట్లాది మంది మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. మోదీ ప్రతి నెలా నిర్వహించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మాట్లాడారు.
మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ 101వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ, ఎన్‌టీఆర్ సేవలను ప్రస్తావించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్‌టీఆర్ చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. గొప్ప నటనా కౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఆయన జీవం పోశారని తెలిపారు. రాజకీయాలతోపాటు సినీ రంగంలో గొప్ప ప్రతిభ చూపారన్నారు. బహుముఖ ప్రతిభతో ఆయన సినీ రంగంలో పేరు, ప్రతిష్ఠలు సంపాదించారని తెలిపారు. 300కుపైగా చిత్రాల్లో నటించి అలరించారని తెలిపారు.
‘స్వతంత్ర’ వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. ఎన్‌టీఆర్ శత జయంతి కార్యక్రమాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
‘యువ సంగమ్’లో పాల్గొన్న ఇద్దరు యువకులతో మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు రాజస్థాన్‌ను సందర్శించగా, బిహార్‌కు చెందిన యువకుడు తమిళనాడును సందర్శించారు. ప్రజల మధ్య సత్సంబంధాలు, అవగాహన పెంపొందించడం కోసం యువ సంగమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడత యువ సంగమ్‌లో సుమారు 1,200 మంది యువత 22 రాష్ట్రాల్లో పర్యటించారని మోదీ చెప్పారు. వీరంతా తమ జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోయే మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు.
‘మన్ కీ బాత్’ను ప్రారంభిస్తూ, ఇది రెండో సెంచరీకి ప్రారంభమని మోదీ తెలిపారు. ఏప్రిల్ 30న 100వ ఎపిసోడ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
New Parliament : సాధికారతను సంరక్షించే చోటు.. నూతన పార్లమెంటు భవనంపై మోదీ వ్యాఖ్య..
New Parliament : బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేసిన మోదీ