PM Modi Road Show: మోదీ రోడ్‌షోకి వచ్చిన హనుమంతుడు.. ఇంతకీ ప్రధాని చూశారో.. లేదో..!

ABN , First Publish Date - 2023-05-06T14:52:39+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బజరంగ్‌బలిని బీజేపీ విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

PM Modi Road Show: మోదీ రోడ్‌షోకి వచ్చిన హనుమంతుడు.. ఇంతకీ ప్రధాని చూశారో.. లేదో..!
Modi RoadShow in Bengalore

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బజరంగ్‌బలిని బీజేపీ విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శనివారం నిర్వహించిన రోడ్‌షోకు ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా తరలివచ్చారు. కొందరు హనుమంతుడి వేషధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. మరికొందరు స్థానిక జానపద కళాకారులు కూడా ఆకర్షణీయమైన వేషధారణతో అలరించారు.

బీజేపీ విజయం కోసం ప్రచారం చేస్తున్న మోదీ శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 26 కిలోమీటర్లు రోడ్‌షో నిర్వహించారు. బెంగళూరులోని ఆర్బీఐ మైదానం సమీపంలోని సోమేశ్వర నుంచి ఈ రోడ్‌షో ప్రారంభమైంది. ‘జై బజరంగబలి’, ‘భారత్ మాతా కీ జై’, ‘వందే మాతరం’ అనే నినాదాలతో మోదీ ఈ రోడ్‌షోను ప్రారంభించారు. ఈ మార్గమంతా పువ్వులు, తదితరాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. బీజేపీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, హారతులు పట్టారు. వీరిలో అనేక మంది కాషాయ రంగు తలపాగాలు ధరించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు పెద్ద సంఖ్యలో నిల్చుని మోదీకి స్వాగతం పలికారు. ఆయనపై పూలు జల్లారు.

ఈ రోడ్‌షోకు ఓ వ్యక్తి హనుమంతుడి వేషధారణలో వచ్చారు. ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనతో అనేక మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఆనందించారు.

బజరంగ్‌బలి వివాదం ఏమిటి?

కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోతో బజరంగ్‌బలి ప్రచారాస్త్రంగా మారాడు. బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలు శత్రుత్వాన్ని, విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని, తమ పార్టీ అధికారం చేపడితే ఇటువంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పడంతో బజరంగ్‌బలిపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. బజరంగ్‌ దళ్, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని మోదీ ‘జై బజరంగ్‌బలి’ అని నినదిస్తున్నారు. ఓటు వేసేటపుడు ‘జై బజరంగ్‌బలి’ అని చెప్పాలని కోరారు. బీజేపీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసాను పఠిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కర్ణాటక శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆంజనేయ దేవాలయానికి వెళ్లి, పూజలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంజనేయ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ, బజరంగ్‌దళ్‌ను నిషేధించే ప్రతిపాదన లేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంను రప్పించే ప్రయత్నాలు సాగేది ఇంకెంత కాలం?

Bajrang Dal Ban : హిందూ సంస్థలపై నిషేధాలు.. భావోద్వేగ రాజకీయాలు..

Updated Date - 2023-05-06T15:23:14+05:30 IST