Maharashtra: ఒకే వేదికపై ఆ ముగ్గురు...

ABN , First Publish Date - 2023-07-11T15:07:58+05:30 IST

మహారాష్ట్రలోని ఎన్‌సీపీలో తిరుగుబాటు అనంతర క్రమంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ , తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే వేదికపైకి రాబోతున్నారు. మోదీకి ఆగస్టు1న లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును పుణెలో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథిగా శరద్ పవార్, అజిత్ పవార్ పాల్గోనున్నారు.

Maharashtra: ఒకే వేదికపై ఆ ముగ్గురు...

పుణె: మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో తిరుగుబాటు అనంతర క్రమంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఒకే వేదికపైకి రాబోతున్నారు. ప్రధాని మోదీకి ఆగస్టు1న లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును పుణెలో (Pune) ప్రదానం చేయనున్నారు. తిలక్ 103 వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం ఉంటుంది. ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు మోదీ నాయకత్వంలో జరిగిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ తెలిపారు.


అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా శరద్ పవార్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు.


అజిత్ పవార్ జూలై 2న రాష్ట్ర రాజకీయాలను ఉలిక్కపడేలా చేస్తూ 8 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. వెంటనే ఆయన ఉప ముఖ్యమంత్రిగా, తక్కిన వారు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ పరిణామాలపై పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎన్‌సీపీలో తిరుగుబాటు పరిణామానికి ముందు రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎన్‌సీపీ నేతల అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఒత్తిడి రాజకీయాల కారణంగానే ఆ మరుసటి రోజే పలువురు ఎన్‌సీపీ నేతలు ఫిరాయింపులకు పాల్పడ్డారని శరద్ పవార్ ఆరోపించారు. ప్రభుత్వంలో చేరిన నేతల అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోదీకి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయనకు, అజిత్ పవార్‌కు శరద్ పవార్ ఎదురుపడతారా? లేదా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.

Updated Date - 2023-07-11T15:11:30+05:30 IST