Heavy Rains: నది మధ్యలో చెట్టు కొమ్మను పట్టుకుని మాజీ మంత్రి కొడుకు ఆర్తనాదాలు!

ABN , First Publish Date - 2023-09-16T13:40:36+05:30 IST

భారీ వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోయిన మాజీ మంత్రి కొడుకు, అతని ఇద్దరు మిత్రులను మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.

Heavy Rains: నది మధ్యలో చెట్టు కొమ్మను పట్టుకుని మాజీ మంత్రి కొడుకు ఆర్తనాదాలు!

ఇండోర్: భారీ వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోయిన మాజీ మంత్రి కొడుకు, అతని ఇద్దరు మిత్రులను మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. మాజీ మంత్రి రంజానా బాఘేల్ కుమారుడు 19 ఏళ్ల యష్, తేజస్ (24), మాల్యా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) కారులో శుక్రవారం రాత్రి బయటికివెళ్లారు. ఇండోర్ జిల్లాలో మునిగిన కల్వర్టును దాటే ప్రయత్నంలో వారి కారు కోరల్ నదిలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో కోరల్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కారులోని ముగ్గురు వ్యక్తులు నది ప్రవాహంలో చిక్కుకున్నారు. మంత్రి కొడుకు యష్ నదిలోని ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండిపోయాడు. ఈ ఘటనపై రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీస్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని స్థానిక గ్రామస్థుల సహాయంతో ముగ్గురిని రక్షించారు.


ఇండోర్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉమాకాంత్ చౌదరి తెలిపారు. “ఘటన జరిగిన సమయంలో రాష్ట్ర మాజీ మంత్రి రంజానా బాఘేల్ కుమారుడు యశ్(19), తేజస్ (24), మాల్యా అనే ముగ్గురు వ్యక్తులు ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కోరల్ నదిపై ఉన్న కల్వర్టు నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ వారు ఆ నదిని దాటడానికి ప్రయత్నించారు. కానీ వరద ఉధృతి ధాటికి వారి కారు నదిలో కొట్టుకుపోయింది. రాత్రి 10 గంటలకు ప్రమాదం గురించి సమాచారం అందింది. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థుల సహాయంతో ముగ్గురిని రక్షించింది. రంజానా బాఘేల్ కుమారుడు యష్‌కు ఈత కొట్టడొం తెలుసు. కానీ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతను అందులో చిక్కుకున్నాడు. ఏదో ఒక విధంగా చెట్టు కొమ్మను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. అనేక ప్రయత్నాల తర్వాత మేము అతని వైపు తాడు విసిరి, యష్‌ను రక్షించాము" అని ఉమాకాంత్ చౌదరి చెప్పారు.

ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇండోర్ నగరంలో నీరు నిలిచిపోవడంతో జనజీవనం అతలాకుతలమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఇండోర్ జిల్లా కలెక్టర్ ఇళయరాజా తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు చెప్పారు. కాగా శనివారం ఉదయం 8.30 గంటల వరకు గత 24 గంటల్లో ఇండోర్ నగరంలో 171 మిల్లీమీటర్ల (6.73 అంగుళాలు) వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వీపీఎస్ చందేల్ తెలిపారు.

Updated Date - 2023-09-16T13:47:19+05:30 IST