Muslim Reservations: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ముస్లింల ఓట్లపై ఫోకస్
ABN , First Publish Date - 2023-03-26T17:41:14+05:30 IST
ఎంఐఎం, కాంగ్రెస్, జేడీఎస్‌లు ముస్లింల ఓట్లను చీల్చే అవకాశం ఉంది.
బెంగళూరు: మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కర్ణాటకలో(Karnataka) రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓట్లకు సంబంధించి రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి బొమ్మై(CM Bommai) సారథ్యంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ముస్లింలకు 2బీ కేటగిరిలో కల్పించిన 4 శాతం రిజర్వేషన్‌న్లను(Muslim Reservation) బీజేపీ(BJP) ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress), ఎంఐఎం(MIM)తప్పుబట్టాయి.
ఈ నెల 24న సీఎం బొమ్మై (Basavaraj Bommai) అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ 4 శాతం రిజర్వేషన్లను ఒక్కలిగ, లింగాయత్ కులాలకు 2శాతం చొప్పున కేటాయించారు. దీంతో 2సీలోని ఒక్కలిగ(Vokkaligas) రిజర్వేషన్లు నాలుగు శాతం నుంచి 6 శాతానికి, 2డీలోని లింగాయత్(Lingayat) రిజర్వేషన్లు 5 శాతం నుంచి 7 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ చర్యలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గట్టిగా సమర్థించుకున్నారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ముస్లింలు కోర్టును ఆశ్రయించినా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వారిని 10 రిజర్వేషన్ ఉన్న ఈడబ్ల్యూఎస్‌లో చేర్చామని చెప్పారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్‌ను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ముస్లిం వర్గాలకు అమలులో ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే విద్యా, ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్న ముస్లింలు మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న కర్ణాటక (Karnataka) శాసన సభ ఎన్నికల్లో గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చింది. బీజేపీ (BJP) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను తొలగించి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీలోకి పంపించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. శాసన సభ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు డీకే శివ కుమార్ (D K Shivakumar) మాట్లాడుతూ, ఓబీసీ (OBC) కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఆస్తిని పంచినట్లుగా రిజర్వేషన్లను పంచవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. రిజర్వేషన్లు అనేవి ఓ ఆస్తి, సంపద కాదన్నారు. రిజర్వేషన్లను పొందడం మైనారిటీల హక్కు అని చెప్పారు. ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దవ్వాలని, వాటిని ప్రధాన సామాజిక వర్గాలకు పంపిణీ చేయాలని తాము కోరుకోవడం లేదన్నారు. మైనారిటీలు తమ సోదరులని, తమ కుటుంబ సభ్యులని చెప్పారు. తమకు ఇస్తామంటున్న ఈ రిజర్వేషన్లను వొక్కళిగలు, వీరశైవ-లింగాయత్‌లు తిరస్కరిస్తున్నారన్నారు. రానున్న 45 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఓబీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించడానికి ఎటువంటి ప్రాతిపదిక, ఆధారం లేవన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు తొలి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా చేస్తోందన్నారు.
జేడీఎస్ అధినేత కుమారస్వామి (JD(S) leader H D Kumaraswamy) కూడా ముస్లిం రిజర్వేషన్లను ప్రభుత్వం రద్దు చేయడాన్ని తప్పుబట్టారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీసుకున్న నిర్ణయంతో ముస్లింల ఓట్లు గంపగుత్తగా బీజేపీ వ్యతిరేకంగా పడతాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఎంఐఎం ప్రచారం ఉధృతం చేయడంతో ముస్లింల ఓట్లు ఎంఐఎంకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఒవైసీ సభలకు జనం పోటెత్తుతున్నారు. ఎంఐఎంకు కర్ణాటకలో ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో ముస్లింల ఓట్లు కాంగ్రెస్, జేడీఎస్‌లకు కూడా కొంతమేర చీలే అవకాశం ఉంది. ఎంఐఎం, కాంగ్రెస్, జేడీఎస్‌లు ముస్లింల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. అదే సమయంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడం ద్వారా హిందువుల ఓట్లు పోలరైజ్ అవుతాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. హిందువుల ఓట్లు బీజేపీకి గంపగుత్తగా పడేందుకు అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.