Poonch Encounter : ఎన్‌కౌంటర్ మృతులు పాకిస్థానీలు.. భారత్‌పై జీహాద్ చేస్తున్నారు.. : పోలీసులు
ABN , First Publish Date - 2023-07-19T15:49:52+05:30 IST
జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినవారి గురించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పాతికేళ్ల లోపు వయసుగలవారేనని, వీరు పాకిస్థాన్ జాతీయులని, భారత దేశంపై జీహాద్ (యుద్ధం) చేయడానికి వచ్చారని వెల్లడైంది.
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినవారి గురించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పాతికేళ్ల లోపు వయసుగలవారేనని, వీరు పాకిస్థాన్ జాతీయులని, భారత దేశంపై జీహాద్ (యుద్ధం) చేయడానికి వచ్చారని వెల్లడైంది. పాక్ ఆక్రమిత కశ్మీరు, అంతర్జాతీయ సరిహద్దు మధ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న లష్కరే తొయిబా ఉగ్రవాద ముఠాలో వీరు సభ్యులని తేలింది.
జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భారత సైన్యం, జమ్మూ-కశ్మీరు పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా మంగళవారం సురన్‌కోటే తహశీలులోని సిందారా గ్రామం వద్ద నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలనుబట్టి వీరు లష్కరే తొయిబా ఉగ్రవాదులని, పాకిస్థాన్ జాతీయులని వెల్లడైంది. వీరి పేర్లు మహమూద్ అహ్మద్, అబ్దుల్ హమీద్, మహమ్మద్ షరీఫ్ అని తెలిసింది. నాలుగో ఉగ్రవాది పేరు తెలియలేదు కానీ, అతను పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఖుర్షీదాబాద్‌కు చెందినవాడని తెలిసింది.
నియంత్రణ రేఖ దాటి మన దేశ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత వీరిని ఎన్‌కౌంటర్ చేశారు. వీరికి సజ్జిద్ జుట్ అనే లష్కరే తొయిబా ఉగ్రవాది నాయకత్వం వహిస్తున్నాడని, 12 మంది ఉగ్రవాదుల గ్రూపులో వీరు సభ్యులని తెలిసింది. వీరు పాక్ ఆక్రమిత కశ్మీరులోని కోట్లి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సియాల్‌కోట్ మధ్యలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరు జీహాద్‌లో కఠోర శిక్షణ పొందినవారు. వీరు ఆఫ్ఘనిస్థాన్‌లోని డ్యురండ్ లైన్ వెంబడి కూడా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరణించిన నలుగురు ఉగ్రవాదులు 18 నెలల నుంచి రాజౌరీ-పూంఛ్ సెక్టర్లో పని చేస్తున్నట్లు నిఘా సమాచారం. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించడానికి, ఇటు నుంచి అటు తరలించడానికి వీరు సహకరిస్తున్నట్లు వెల్లడైంది. పీర్ పంజల్‌కు దక్షిణ దిశలోని ప్రాంతం నుంచి, దక్షిణ కశ్మీరు ప్రాంతాల నుంచి ఈ విధంగా ఉగ్రవాదుల రాకపోకలు జరుగుతున్నట్లు తెలిసింది. రాజౌరీ-పూంఛ్ సెక్టర్లో దట్టమైన అడవులు ఉండటం వీరికి చాలా అనుకూలంగా ఉంది. 2020 నుంచి వీరు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ, 24 మంది సామాన్యులను, సైనికులను హతమార్చారు. పర్యాటక రంగంపై కశ్మీరులో మే 24న జరిగిన జీ-20 సదస్సును భగ్నం చేయడం కోసం వీరు ఏప్రిల్ 20న, మే 5న పూంఛ్ సెక్టర్లో దాడులు చేశారు.
దీనినిబట్టి పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతోంది. భారత దేశంపై దాడులు చేయాలనే కుట్రతోనే ఈ ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలను మూసేస్తేనే చర్చలు జరుపుతామని పాకిస్థాన్‌కు భారత్ స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Terror Plot : బెంగళూరులో భారీ ఉగ్ర దాడుల కుట్ర భగ్నం