New Parliament Bulding : పార్లమెంటు కొత్త భవనం ప్రారంభంపై రాహుల్ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-05-21T18:38:40+05:30 IST

పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాన మంత్రి మోదీ ఈనెల 28న ప్రారంభించే అవకాశాలుండగా, విపక్షాల నుంచి 'కోరస్'గా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం వీరితో తన గొంతు కలిపారు. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి కానీ, ప్రధానమంత్రి కాదని ట్వీట్ చేశారు.

New Parliament Bulding : పార్లమెంటు కొత్త భవనం ప్రారంభంపై రాహుల్ ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనాన్ని (New Parliament Building) ప్రధాన మంత్రి మోదీ ఈనెల 28న ప్రారంభించే అవకాశాలుండగా, విపక్షాల నుంచి 'కోరస్'గా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు భవంతిని లెజిస్లేచర్ అధిపతి ప్రారంభించాలే కానీ, ప్రభుత్వాధిపతి కాదంటూ వాదనలు ఊపందుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం వీరితో తన గొంతు కలిపారు. పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి (President) ప్రారంభించాలి కానీ, ప్రధానమంత్రి కాదని ఆయన ఆదివారంనాడు ట్వీట్ చేశారు.

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించాలని ఆహ్వానించేందుకు స్పీకర్ ఓం బిర్లా ఈ వారంలో మోదీని కలిసినట్టు లోక్‌సభ సెక్రటేరియట్ ఈనెల 18న ప్రకటించింది. ఆ వెంటనే విపక్షాలు విమర్శలకు దిగాయి. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సింది లెజిస్లేచరే కానీ, ప్రభుత్వ అధిపతి కాదంటూ పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రారంభోత్సవానికి లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్‌ను ఎందుకు ఎంచుకోలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.

వీర సావర్కర్ జయంతి రోజునే ఎందుకు?

కాగా, పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఎంచుకున్న తేదీపై తృణమూల్ కాంగ్రెస్ నిలదీసింది. వీరసావర్కర్ జయంతి రోజునే (మే 28) ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారని టీపీంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ప్రశ్నించారు. విదేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ, అందుకు భిన్నంగా జీవితాంతం గాంధీని వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజునే కొత్త పార్లమెంటు భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని మరికొందరు నిలదీశారు.

Updated Date - 2023-05-21T18:43:37+05:30 IST