Priyanka Gandhi: బీ రెడీ...ఏడాది మాత్రమే సమయం ఉంది..!
ABN , First Publish Date - 2023-02-26T15:56:28+05:30 IST
కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని, కేంద్రంలోని అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కార్యకర్తలకు దిశానిర్దేశం..
రాయపూర్: కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని, కేంద్రంలోని అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముంచుకొస్తున్న తరుణంలో విపక్ష పార్టీల ఐక్యతపైనే అందరి దృష్టి ఉందని, అయితే ఎక్కువగా కాంగ్రెస్‌పైనే అందరి అంచనాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కేవలం ఏడాది మాత్రమే మన చేతిలో ఉందని ఆమె అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా మూడురోజల పాటు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో చివరిరోజైన ఆదివారంనాడు ప్రియాంక ప్రసంగించారు. ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని బీజేపీని ఎదుర్కోవాలని సమావేశంలో తీర్మానించారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సమష్టిగా కార్యకర్తలంతా పనిచేయాలని ప్రియాంక సూచించారు.
బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల్లో ప్రజలకు సంబంధం లేని అంశాలను వారు లేవనెత్తుతుంటారని, అయితే నిరుద్యోగ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, జీడీపీని పటిష్టం చేయం ఎలా? ఆర్థిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాలను ప్రస్తావించే దిశగా రాజకీయాలు ఉండాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ బీజేపీ దాడులు చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పటిష్టంగా ఎదుర్కొంటోదని, కార్యకర్తలు పార్టీ కోసం చేస్తున్న పోరాటం ప్రశంసనీయమని అన్నారు. ''బీజేపీని ఎదుర్కోగలిగిన ధైర్యం మీకు ఉందని తెలుసు. దేశం కోసం మీ ధైర్యాన్ని ప్రదర్శించే సమయం ఇప్పుడు వచ్చింది'' అని ప్రియాంక అన్నారు. ఇప్పుడు ఏడాది మాత్రమే మన చేతిలో ఉందని, దీనికి తోడు అన్ని పార్టీలను ఐక్యం చేయగల సత్తా కాంగ్రెస్‌కు ఉందనే అంచనాలు కూడా మనపై బలంగా ఉన్నాయని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే విపక్ష పార్టీలు, ప్రజలు సమైక్యంగా పోరాడాలని అన్నారు.
మూడు రోజల సదస్సులో భాగంగా శనివారంనాడు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రసంగించారు. చివరి రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్లీనరీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోవాలనే తీర్మానం చేశారు.