Congress : గాంధీ కుటుంబం నుంచి మరో వారసురాలు.. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు..
ABN , First Publish Date - 2023-08-13T15:32:37+05:30 IST
వారసత్వ రాజకీయాలు క్విట్ ఇండియా అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నినాదాలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రథమ కుటుంబం నుంచి మరో వారసురాలు రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాలు క్విట్ ఇండియా అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నినాదాలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రథమ కుటుంబం నుంచి మరో వారసురాలు రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఎన్నికల బరిలో దిగే అవకాశాల గురించి ఆమె భర్త రాబర్ట్ వాద్రా పరోక్షంగా ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తన సతీమణి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటులో ఉంటే బాగుంటుందన్నారు. ఆమె కోసం పార్టీ ఓ మంచి ప్రణాళికను రచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘కచ్చితంగా ఆమె లోక్ సభలో ఉండాలి. అందుకు ఆమెకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఆమె పార్లమెంటులో ఉంటే బాగుంటుంది. అక్కడ ఉండే అర్హత ఆమెకు ఉంది. దీనిని కాంగ్రెస్ పార్టీ అంగీకరించి, ఆమె కోసం మెరుగైన ప్రణాళిక రచిస్తుందని ఆశిస్తున్నాను’’ అని రాబర్ట్ వాద్రా చెప్పారు.
ప్రియాంక గతంలో రాయ్ బరేలీ, అమేథీ ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేశారు. కాంగ్రెస్ వ్యవస్థను ఈ నియోజకవర్గాల్లో పటిష్టం చేయడానికి రెండు దశాబ్దాలపాటు కృషి చేశారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా, రాయ్ బరేలీలో సోనియా గాంధీ విజయం సాధించారు.
పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీతో తనకు సంబంధాలు ఉన్నాయని స్మృతి ఇరానీ ఆరోపించడాన్ని రాబర్ట్ వాద్రా తీవ్రంగా ఖండించారు. అదానీతో కలిసి తాను చేసినదేమిటో బయటపెట్టాలని సవాల్ విసిరారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే భరిస్తానని లేదంటే వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్
Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు