Rahul Gandhi : మోదీ చెప్తున్నదంతా అబద్ధం : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-08-25T13:24:35+05:30 IST

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్తున్నదంతా అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన భూమిని చైనా సైన్యం ఆక్రమించిందని చెప్పారు.

Rahul Gandhi : మోదీ చెప్తున్నదంతా అబద్ధం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్తున్నదంతా అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన భూమిని చైనా సైన్యం ఆక్రమించిందని చెప్పారు. ఆయన కార్గిల్‌లో శుక్రవారం నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆయన కార్గిల్ యుద్ధ వీరుల స్మారక కేంద్రం వద్ద అమరులకు నివాళులర్పిస్తారు.

‘‘లడఖ్ వ్యూహాత్మక ప్రదేశం. ఒక విషయం సుస్పష్టం. భారత దేశ భూమిని చైనా ఆక్రమించుకుంది. చైనా ఒక అంగుళం భూమినైనా ఆక్రమించుకోలేదని ప్రతిపక్షాల సమావేశంలో ప్రధాన మంత్రి చెప్పడం విచారకరం. ఇది అబద్ధం’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావిస్తూ, తాను కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేశానని చెప్పారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ వ్యాపింపజేస్తున్న హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా నిలవడమే లక్ష్యంగా ఈ యాత్ర జరిగిందన్నారు. ఇతర నేతలు (మోదీ) తమ మనసులో మాట (మన్ కీ బాత్) చెప్పడంలో తీరిక లేకుండా గడుపుతారన్నారు. తాను మాత్రం ‘‘మీ మనసులో మాటను వినాలని’’ అనుకున్నానని చెప్పారు. లడఖ్ రక్తం, డీఎన్ఏలలో గాంధీజీ, కాంగ్రెస్ భావజాలం ఉన్నట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ దాదాపు వారం రోజుల నుంచి లడఖ్‌లో పర్యటిస్తున్నారు. కార్గిల్ యుద్ధ వీరుల స్మారక కేంద్రం వద్ద అమరులకు నివాళులర్పించిన తర్వాత శ్రీనగర్ వెళ్తారు. మార్గమధ్యంలో ద్రాస్‌లో కాసేపు స్థానికులతో మాట్లాడతారు.

జమ్మూ-కశ్మీరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని శుక్రవారం మాట్లాడుతూ, రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం రాహుల్ శ్రీనగర్ వస్తున్నారని చెప్పారు. ఈ కుటుంబ పర్యటనలో సోనియా గాంధీ కూడా పాల్గొంటున్నారని, వీరిద్దరూ రాజకీయ నేతలను కలవబోరని చెప్పారు.

రాహుల్ గాంధీ ఈ నెల 17 నుంచి లడఖ్‌లో పర్యటిస్తున్నారు. జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని 2019 ఆగస్టులో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.


ఇవి కూడా చదవండి :

Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..

PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

Updated Date - 2023-08-25T13:24:35+05:30 IST