Share News

MP Assembly Polls: కాంగ్రెస్ ప్రభంజనం..150 సీట్లు ఖాయం: రాహుల్

ABN , First Publish Date - 2023-11-14T16:17:58+05:30 IST

మధ్యప్రదేశ్‌‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, 145 నుంచి 150 సీట్లను తాము గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల అనంతరం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రజల తీర్పును కాలరాసారని అన్నారు.

MP Assembly Polls: కాంగ్రెస్ ప్రభంజనం..150 సీట్లు ఖాయం: రాహుల్

విదిష: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభంజనం వీస్తోందని, 145 నుంచి 150 సీట్లను తాము గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల అనంతరం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తుఫాన్ రాబోతోందని అన్నారు.


రాష్ట్ర ప్రజల వాణిని ప్రధాని మోదీ అణిచివేస్తున్నారని, ప్రజలను వంచిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని విదిషలో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, అయితే బీజేపీ నేతలు నరేంద్ర మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. తద్వారా ప్రజల వాణిని అణగదొక్కారని అన్నారు. ప్రజా తీర్పును, ప్రజలు వంచించారని ఆరోపించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ తుఫాన్ ఖాయమని, 230 అసెంబ్లీ స్థానాల్లో 145 నుంచి 150 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుందని అన్నారు. ఈ విషయాన్ని రాసి పెట్టుకోండని అన్నారు. తాను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించానని, కాంగ్రెస్ గాలులు బలంగా వీస్తున్నాయని తెలిపారు.


అహింసాయుత సైనికులు..

కాంగ్రెస్ పార్టీ నేతలు అహింసాయుత సైనికులు వంటివారని, విపక్షాలను ఓడించేందుకు హింసకు పాల్పడరని, ప్రేమే ఆయుధంగా బీజేపీని అధికారం నుంచి తరిమికొడతామని రాహుల్ అన్నారు. కర్ణాటకలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగింది ఇదేనని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీని తరిమికొట్టామని, హింసతో కాకుండా కేవల ప్రేమతోనే తాము ఈ విజయాలు సాధించామని అన్నారు. కర్ణాటకలో 40 శాతం కమిషన్ల ప్రభుత్వాన్ని సాగనంపామని, మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-11-14T16:17:59+05:30 IST