New Parliament Building : ‘దురహంకారపు ఇటుకలు’.. నూతన పార్లమెంటు భవనంపై రాహుల్ గాంధీ..
ABN , First Publish Date - 2023-05-24T16:13:00+05:30 IST
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ చర్యలు రాజ్యాంగ అధిపతిని అవమానించడమేనని దుయ్యబడుతున్నాయి. మే 28న జరిగే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఓ ప్రకటనను జారీ చేశాయి.
న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ చర్యలు రాజ్యాంగ అధిపతిని అవమానించడమేనని దుయ్యబడుతున్నాయి. మే 28న జరిగే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఓ ప్రకటనను జారీ చేశాయి. తెదేపా, వైకాపా, ఎస్ఏడీ, బీజేడీ ఈ కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. బీఆర్ఎస్ ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మోదీపై విరుచుకుపడ్డారు.
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మే 28న ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాబోమని 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువ లేదని ఆరోపించాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఈ ప్రకటనను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా (Amit Shah) బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని తెలిపారు. దీనిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. దీని గురించి ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు.
రాహుల్ గాంధీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపజేయకుండా, ఈ కార్యక్రమానికి కనీసం ఆమెను ఆహ్వానించకుండా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దేశ సర్వోన్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని ఆరోపించారు. పార్లమెంటు నిర్మితమయ్యేది దురహంకారపు ఇటుకలతో కాదని, రాజ్యాంగ విలువలతోనేనని చెప్పారు.
జ్ఞాన బోధ
బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, గతంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh)ను ఇబ్బందిపెడుతూ, మీడియా సమక్షంలో ఓ ఆర్డినెన్స్‌ను దురహంకారంతో చింపేశారన్నారు. నేడు ఆయన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే విషయంలో రాష్ట్రపతి పదవిని గౌరవించడం గురించి జ్ఞాన బోధ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ సమగ్రత, అఖండతల గురించి సలహాలు ఇవ్వడానికి ముందు ఆయన తన సొంత పార్టీ సహచరులను, సీనియర్లను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలన్నారు.
ఓం బిర్లా ఆహ్వానం
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా (Om Birla) ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మోదీ ఈ భవనాన్ని ఈ నెల 28న ప్రారంభించబోతున్నారు.
మీ పెద్దలు చేసినదేమిటో..
కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి గతంలో జరిగిన ఇటువంటి కార్యక్రమాలను గుర్తు చేశారు. 1975 ఆగస్టులో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) పార్లమెంటు అనెక్స్‌ను ప్రారంభించారని, 1987లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) పార్లమెంటు గ్రంథాలయాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. మీ (కాంగ్రెస్) ప్రభుత్వాధినేత వాటిని ప్రారంభించినపుడు, మా (ఎన్డీయే) ప్రభుత్వాధినేత ఇప్పుడు అదే పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం
New Parliament Building : ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు