Bharat Jodo Yatra: అది జాకెట్ కాదు, రెయిన్ కోట్: కాంగ్రెస్ స్పష్టత

ABN , First Publish Date - 2023-01-20T16:44:47+05:30 IST

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో తొలిసారి రాహుల్ గాంధీ 'బ్లాక్ జాకెట్' ధరించారంటూ వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాహుల్ వేసుకున్నది...

Bharat Jodo Yatra: అది జాకెట్ కాదు, రెయిన్ కోట్: కాంగ్రెస్ స్పష్టత

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో తొలిసారి రాహుల్ గాంధీ 'బ్లాక్ జాకెట్' ధరించారంటూ వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదని, రెయిన్ కోట్ అని స్పష్టత ఇచ్చింది. భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కశ్మీర్‌లోని కతువాలో శుక్రవారం ప్రారంభమైంది. తీవ్రమైన చలిగాలులు, మంచు కురుస్తుండటం, చిరుజల్లుల కారణంగా యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. రాహుల్ ఒంటిపై బ్లాక్ జాకెట్ కొద్దిసేపు వేసుకుని కనిపించారు. కొద్దిసేపటికి దానిని ఒంటిపై నుంచి తీసేసి తెలుపురంగు టీ షర్ట్‌తోనే యాత్ర కొనసాగించారు.

కతువాలో రాహుల్ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మధ్యాహ్నం ఓ ట్వీట్‌లో స్పష్టత ఇచ్చింది. ''యాత్రలో రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదు, రెయిన్ కోట్. వర్షం ఆగిపోయింది, దానితో పాటే రెయిన్‌ కోట్ కూడా మాయమైంది'' అని ట్వీట్ చేసింది. వర్షం కూడా యాత్రను అడ్డుకోలేకపోయిందంటూ ఒక వీడియోను కూడా ట్వీట్‌కు జోడించింది.

తమిళనాడులోని కన్యాకుమారిలో గత ఏడాది సెప్టెంబర్ 7వ పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి రాహుల్ తెలుపురంగు టీ షర్ట్‌లోనే యాత్ర కొనసాగిస్తూ వచ్చారు. చలికాలంలోనూ టీషర్ట్‌తో ఆయన పాదయాత్ర చేయడం చర్చనీయాంశం కూడా అయింది. రాహుల్ స్వయంగా ఒకసారి దీనిపై వివరణ ఇచ్చారు. పాదయాత్రలో ఇద్దరు పిల్లల్ని తాను చూశానని, ఒంటిని కప్పుకునే దుస్తులేవీ లేకుండా వాళ్లు పాల్గొనడం చూసిన తర్వాత తాను కూడా చలి అనిపించేంతవరకూ టీషర్ట్‌తోనే పాదయాత్ర సాగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రాహుల్ పాదయాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే భారీ కార్యక్రమంతో ముగియనుంది. దేశంలోని వివిధ పార్టీల ప్రముఖ నేతలందరినీ ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోంది.

Updated Date - 2023-01-20T16:49:41+05:30 IST