Rajasthan: రాజస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల... 10వ తరగతి బాలికలకు రూ.10 వేలు
ABN , First Publish Date - 2023-11-16T17:48:30+05:30 IST
రాజస్థాన్(Rajasthan)లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష బీజేపీ కీలకమైన మేనిఫెస్టోని(BJP Manifesto) ఇవాళ విడుదల చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పార్టీ నేతలతో కలిసి జైపుర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
జైపుర్: రాజస్థాన్(Rajasthan)లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష బీజేపీ కీలకమైన మేనిఫెస్టోని(BJP Manifesto) ఇవాళ విడుదల చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పార్టీ నేతలతో కలిసి జైపుర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బీజేపీ మహిళా సాధికారత మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ కేసులను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, వసుంధర రాజే, గజేంద్ర సింగ్ షెకావత్, సతీష్ పూనియా తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, మహిళా సాధికారత, పేద, బడుగు బలహీనవర్గాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్లు నడ్డా పేర్కొన్నారు.
మేనిఫెస్టోలో పథకాలు..
1. ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కంటే గోధుమపై క్వింటాల్‌కు రూ.2 వేల 700 బోనస్.
2. ఆడపిల్లల కోసం లాడో ప్రోత్సాహన్ యోజన. దీని కింద మధ్యప్రదేశ్‌లోని ప్రతి ఆడపిల్ల పేరు మీద రూ.2 లక్షల పొదుపు బాండ్.
3. బాలికలు ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.6 వేలు, 9వ తరగతిలో ఏడాదికి రూ. 8 వేలు, 10వ తరగతిలో రూ.10 వేలు, 11వ తరగతిలో రూ.12 వేలు, రూ.14 వేలు, గ్రాడ్యుయేషన్ చేస్తున్న బాలికలకు రూ. 50 వేలు అందిస్తారు. 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు రూ.లక్ష సాయం.
4. ప్రతిభావంతులైన బాలికలకు 12వ తరగతి పూర్తయితే ఉచిత స్కూటీలు.
5. 'లఖపతి దీదీ' పథకం కింద ఆరు లక్షల గ్రామీణ మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం
6. ఉజ్వల పథకం కింద రూ. 450కే గ్యాస్ సిలిండర్.
7. మాతృ వందన్ యోజన కింద నగదు ప్రోత్సాహకం రూ.8,000 కు పెంపు.
8. విద్యార్థులు విద్యాసామగ్రి కొనుగోలు చేయడానికి రూ.12 వందల ప్రోత్సాహకం.
9. వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు రూ.40 వేల కోట్లు కేటాయింపు. 15 వేల మంది వైద్యులు, 20 వేల మంది పారామెడికల్ సిబ్బంది నియామకం.
10. ఆరావళి శ్రేణులను రక్షించడానికి గ్రీన్ కారిడార్, ఎడారీకరణను నిరోధించడానికి రూ.50 కోట్లతో థార్ కన్జర్వేషన్ మిషన్ ఏర్పాటు.
విజన్ లేని మేనిఫెస్టో..: కాంగ్రెస్
బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్(Congress) మండిపడింది. రాష్ట్ర అభివృద్ధిపై విజన్ లేని మేనిఫెస్టోని బీజేపీ రూపొందించిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వర్నీమ్ చతుర్వేది మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టో పేలవంగా ఉందని, దానికి ఎలాంటి విజన్ లేదని అన్నారు. "BJP గ్యాస్ సిలిండర్లను రూ. 450 కి ఇస్తామంటోంది. ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ ని రూ.500కి ఇస్తామంటున్నారు. వారికే ఈ విషయంలో క్లారిటీ లేదు. అవే ధరలకు గ్యాస్ సిలిండర్ ని దేశ ప్రజలకు ఎందుకు అందజేయరు? ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని 2018లో బీజేపీ హామీ ఇచ్చింది కానీ దానిని ఇప్పటికీ అమలు చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలకు బీజేపీ విస్మరించింది” అని చతుర్వేది అన్నారు.