BJP Vs Congress : భారత్ జోడో యాత్రపై రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-01-22T16:27:18+05:30 IST
మన దేశంలో విద్వేషం వ్యాపించిందని చెప్తున్నవారు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ : మన దేశంలో విద్వేషం వ్యాపించిందని చెప్తున్నవారు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేష రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)లపై మండిపడ్డారు.
మధ్య ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, దేశంలో విద్వేషం ఉందని చెప్తూ, భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని తాను ఓ ప్రశ్న అడుగుతున్నానని చెప్పారు. ఈ దేశంలో విద్వేషానికి ఎవరు జన్మనిస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారూ, మీకేం జరిగింది? అని అడిగారు. మన సైనికుల ధైర్య, సాహసాలను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, భారత దేశం ముక్కలైన దేశమా? దానిని ఏకం చేయడానికి? అని నిలదీశారు. భారత దేశం 1947లో విభజనకు గురైందని, ఇక మీదట ముక్కలు కాబోదని చెప్పారు. ఎవరు పడితే వారు వచ్చి వాటా కోరడానికి అనువైన దేశంగా ఇక మీదట ఉండబోదని స్పష్టం చేశారు. భారత దేశ ఔన్నత్యానికి విఘాతం కలుగకూడదని కరాఖండీగా చెప్పారు. ‘రాహుల్ గాంధీ గారూ, దేశ కీర్తి, ప్రతిష్ఠలను నాశనం చేయడానికి ప్రయత్నించకండి’ అని హితవు పలికారు. రాజకీయాలు కేవలం ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి కాదని, సమాజాలను సృష్టించడానికని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో అవినీతి అంతానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని, 2047 నాటికి సంపన్న దేశంగా అభివృద్ధి చెందుతుందని తనకు నమ్మకం ఉందన్నారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారిలో ప్రారంభమైంది. ఈ నెల 30తో కశ్మీరులో ముగుస్తుంది. ఆయన ఈ యాత్రలో బీజేపీ (BJP), ఆరెస్సెస్ (RSS)లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోని సాంఘిక కలనేత దెబ్బతిందని ఆరోపిస్తున్నారు.