Narendra Modi: సరిహద్దుల్లో శాంతితోనే బీజింగ్‌తో సంబంధాల్లో పురోగతి.. వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మోదీ
ABN , First Publish Date - 2023-06-20T16:08:21+05:30 IST
భారతదేశం తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతతతోనే బీజింగ్‌తో మెరుగైన సంబంధాలు సాధ్యమని చెప్పారు. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు 'వాల్ స్ట్రీట్ జర్నల్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాతో సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై మోదీ మాట్లాడారు.
న్యూఢిల్లీ: భారతదేశం తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతతతోనే బీజింగ్‌తో మెరుగైన సంబంధాలు సాధ్యమని చెప్పారు. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు 'వాల్ స్ట్రీట్ జర్నల్' (Wall Street Journal)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాతో సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికాతో భారత్‌కు ఉన్న బంధం వంటి పలు అంశాలపై మోదీ స్పందించారు.
''ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్యాన్ని ఇండియా బలంగా నమ్ముతుంది. చట్టబద్ధమైన పాలనను పాటిస్తూ, విభేదాలు, వివాదాల విషయంలో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటుంది. ఇదే సమయంలో దేశ సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడుకునేందుకు పూర్తి సంసిద్ధంగా ఉంది'' అని మోదీ తెలిపారు.
అమెరికాతో సంబంధాలపై...
భారత్-అమెరికా మధ్య సంబంధాలు గతంలో కంటే మరింత బలంగా ఉన్నాయని మోదీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు న్యూఢిల్లీపై ''అసాధారణమైన నమ్మకం'' ఉందన్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో విస్తృతమైన పాత్ర పోషించేందుకు భారత్ అర్హమైనదని, విద్య, మౌలిక సదుపాయపై విస్తృత పెట్టుబడులు పెడుతున్నామని, అనేక బహుళజాతి సంస్థలు సైతం తమవైపు చూస్తున్నాయని, ప్రపంచంలో తాము సముచిత స్థానాన్ని దక్కించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు.
తటస్థం కాదు...శాంతివైపే ఉన్నాం..
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంపై మాట్లాడుతూ, ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోందని కొందరు అంటున్నారని, అయితే అది సరికాదని చెప్పారు. ''మేము తటస్థంగా లేము...శాంతివైపే ఉన్నాం'' అని మోదీ స్పష్టం చేశారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సి ఉంటుందని అన్నారు. వివాదాలు ఉంటే వాటిని దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధంతో కాదని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తాను చాలాసార్లు మాట్లాడానని, మేలో జపాన్‌లో జరిగిన జీ-7 సదస్సుకు హాజరైనప్పుడు కూడా జెలెన్‌స్కీతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఘర్షణలను పరిష్కరించి ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకు వచ్చేందుకు నిబద్ధతతో జరిగే అన్ని ప్రయత్నాలను భారత్ సమర్ధిస్తుందని, ఈ దిశగా చేయగలిగినదంతా చేస్తుందని మోదీ తెలిపారు.