Same-sex marriage : స్వలింగ వివాహాలపై బయటపడిన ఆరెస్సెస్ వైఖరి
ABN , First Publish Date - 2023-03-14T16:24:01+05:30 IST
స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే వివాహాలు జరగాలని స్పష్టం చేసింది.
స్వలింగ వివాహాల (Same-sex marriage)కు చట్టపరమైన చెల్లుబాటు కల్పించాలని కోరుతూ కొందరు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరుపుతోంది. రాబోయే కాలంలో ముఖ్యమైన ప్రభావం చూపే అంశమని చెప్తూ, దీనిపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుందని సోమవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో, స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించాలనడాన్ని వ్యతిరేకించింది. స్వలింగ పెళ్లిళ్ల వల్ల విధ్వంసం, అరాచకం ఏర్పడతాయని తెలిపింది. వ్యక్తిగత చట్టాలు, ఆమోదిత సామాజిక విలువల మధ్య సున్నితమైన సమతుల్యత ఉండాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే (RSS general secretary Dattatreya Hosabale) ఓ వార్తా సంస్థతో మంగళవారం మాట్లాడుతూ, స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే పెళ్లి జరగాలని చెప్పారు. స్వలింగ పెళ్లిళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఆరెస్సెస్ ఏకీభవిస్తోందన్నారు.
ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శల గురించి ప్రస్తావించినపుడు దత్తాత్రేయ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించవలసిన అవసరం లేదన్నారు. వారు వారి రాజకీయ ఎజెండాను అనుసరిస్తున్నారన్నారు. ఆరెస్సెస్ గురించి వాస్తవాలు ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. ప్రముఖ ప్రతిపక్ష నేతగా ఆయన మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుందని చెప్పారు.
భారత దేశ స్వరూప, స్వభావాలను నేటి ప్రపంచం ముందు ఉంచాలన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవారందరికీ భారత దేశ స్వరూప, స్వభావాలు గర్వకారణమని చెప్పారు. రానున్న పాతికేళ్ళలో భారత దేశం ఆర్థిక, మౌలిక సదుపాయాల రంగాల్లో మాత్రమే కాకుండా, క్రీడలు, సంస్కృతి వంటి అనేక ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలన్నారు.
ఆరెస్సెస్ శాఖలను మండలాల స్థాయికి విస్తరించడం చాలా ముఖ్యమని చెప్పారు. 2025లో జరిగే ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలు 2024లో విజయ దశమి నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు.
రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, ఆరెస్సెస్ ఛాందసవాద, ఫాసిస్ట్ సంస్థ అని విమర్శించిన సంగతి తెలిసిందే. భారత దేశంలోని వ్యవస్థలను కబ్జా చేసి, ప్రజాస్వామిక పోటీ స్వభావాన్ని మార్చేసిందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం
Taliban : భారత్ చర్యతో అవాక్కయిన తాలిబన్లు