Neighbourhood First : పొరుగు దేశంలో తీవ్ర సంక్షోభం... సంపూర్ణంగా సహకరిస్తామన్న భారత్...
ABN , First Publish Date - 2023-01-20T17:22:48+05:30 IST
మునుపెన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పటి నుంచి భారత్ అనేక విధాలుగా సహాయపడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి
కొలంబో : తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) పర్యటన నూతన ఆశలను చిగురింపజేసింది. జైశంకర్ గురువారం సాయంత్రం కొలంబో చేరుకున్నారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రధాన మంత్రి దినేశ్ గుణవర్ధన, విదేశాంగ మంత్రి అలీ సబ్రి, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స, ఇండియన్ హై కమిషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. జైశంకర్ రెండు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తారు.
2022లో శ్రీలంకలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పటి నుంచి భారత్ అనేక విధాలుగా సహాయపడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుంచి సుమారు 24,000 కోట్ల బ్రిడ్జ్ లోన్ తీసుకునేందుకు శ్రీలంక తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో భారత్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పొరుగు దేశాలకు పెద్దపీట విధానంలో భాగంగా శ్రీలంకకు సంపూర్ణ సహకారం అందిస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హామీ ఇచ్చారు. ఆర్థిక చేయూతను కూడా అందిస్తామని ప్రకటించారు. పొరుగువారికి పెద్దపీట, భాగస్వామిని తన ఖర్మకు తనను వదిలిపెట్టకూడదనేది తమ విధానమని చెప్పారు.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవడానికి చైనాయే కారణమనే ఆరోపణల నేపథ్యంలో జైశంకర్ మాట్లాడుతూ, ఇతరుల కోసం వేచి చూడకూడదని, సరైనదని నమ్మినదానిని చేయాలని భారత దేశం నిర్ణయించుకుందని చెప్పారు. దీనివల్ల శ్రీలంక పరిస్థితి బలపడటంతోపాటు, ద్వైపాక్షిక రుణదాతలందరినీ సమానంగా చూసేలా చేస్తుందని చెప్పారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో అత్యధిక పెట్టుబడులను భారత దేశం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యంగా పునరుద్ధరణీయ ఇంధనం, పర్యాటకం, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. మరింత మెరుగైన వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఏర్పరచేందుకు శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. శక్తిమంతమైన ఆకర్షక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సహకరిస్తామన్నారు. పరిస్థితి తీవ్రతను శ్రీలంక విధాన నిర్ణేతలు అర్థం చేసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పారు.
రణిల్ విక్రమసింఘేను ఉద్దేశించి మాట్లాడుతూ, సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత దేశ సంఘీభావం, మద్దతును తెలియజేయడమే తన పర్యటన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీలంక రాజకీయంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి భారత దేశం ఎల్లప్పుడూ సహకరిస్తోందన్నారు.
చైనా వైఖరి
శ్రీలంకకు అతి పెద్ద రుణదాతలు, పెట్టుబడిదారుల్లో ఒకటైన చైనా తాత్సారం చేస్తోంది. సకారాత్మక సంకేతాలను (Positive Signalsను) పంపించడం లేదు. దీంతో శ్రీలంక తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆ దేశానికి తాను ఇచ్చిన రుణాలను చైనా రద్దు చేసి, త్వరగా కోలుకునేందుకు సహాయపడాలని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు.
భారత్ అండదండలు
2022లో రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత దేశం రుణాలు, తదితర రూపాల్లో రూ.32,000 కోట్లు మేరకు ఆర్థిక సాయం చేసింది. దీంతో ఆ దేశం కాస్త తేరుకుంది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.