Maharashtra politics: ఎన్‌సీపీలో మరో సంచలన పరిణామం... బాంబు పేల్చిన బీజేపీ
ABN , First Publish Date - 2023-05-07T16:25:11+05:30 IST
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత నితీష్ రాణె ఎన్‌సీపీలో చోటుచేసుకోనున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీపీతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేతులు కలుపబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra politics) రసవత్తంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన శరద్ పవార్, ఆ తర్వాత రెండు రోజులకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, తాజాగా బీజేపీ నేత నితీష్ రాణె (Nitish Rane) ఎన్‌సీపీలో చోటుచేసుకోనున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీపీతో శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) చేతులు కలుపబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ 10వ తేదీలోపు ఈ పరిణామం చోటుచేసుకోనున్నట్టు చెప్పారు. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఆ పార్టీని విడిచిపెట్టేంత వరకూ సంజయ్ రౌత్ వేచిచూడాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మధ్య విభేదాలను సంజయ్ రౌత్ సృషిస్తున్నారని కూడా రాణే ఆరోపించారు.
ఎన్‌సీపీలో చేరనున్న రౌత్
సంజయ్ రౌత్ జూన్ 10వ తేదీలోపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే విషయం తాను చాలా స్పష్టంగా చెప్పగలనని నితీష్ రాణే అన్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. శరద్ పవార్ పార్టీలోకి చేరేందుకు రౌత్ కొన్ని షరతులు విధించారని, అజిత్ పవార్ ఎన్‌సీపీని విడిచిపెట్టిన వెంటనే ఆ పార్టీలో చేరతానని చెప్పినట్టు తెలుస్తోందని అన్నారు. ఉద్ధవ్ థాకరే తనను మరోసారి ఎంపీని చేసే స్థితిలో లేరనే భయం రౌత్‌కు పట్టుకుందని, ఆ విషయాన్ని ఎన్‌సీపీ నేతల దృష్టికి రౌత్ తెచ్చారని కూడా రాణే అన్నారు.
''రాబోయే రోజుల్లో ఎన్‌సీపీ వేదికపై రౌత్‌ను చూడబోతున్నాం. శరద్ పవార్ రాజీనామా చేయగానే దేశంలోని విపక్ష నేతలంతా ఆయనకు ఫోన్ చేశారు. తనకు ఎలాంటి ఫోన్ రాలేదని ఉద్ధవ్ థాకరే చెబుతున్నారు. ఉద్ధవ్ రాజకీయాలకు చరమగీతం పాడాలని రౌత్ ప్రయత్నిస్తున్నారు. ఉద్ధవ్, రాజ్ థాకరే మధ్య విభేదాలను సృష్టిస్తున్నది కూడా ఆయనే (రౌత్).'' అని రాణే ఆరోపించారు.