Rahul Gandhi: మోదీ దేశభక్తి మోడల్‌ను ప్రశ్నించిన రాహుల్.. బలవంతులకు తలవొగ్గడమే సావర్కర్ ఐడియాలజీ..!

ABN , First Publish Date - 2023-02-26T13:39:44+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైన, ఆయన దేశభక్తి మోడల్‌పైన రాహుల్ గాంధీ ఆదివారంనాడు విమర్శలు గుప్పించారు. బలవంతులకు తలవొగ్గడమే..

Rahul Gandhi: మోదీ దేశభక్తి మోడల్‌ను ప్రశ్నించిన రాహుల్.. బలవంతులకు తలవొగ్గడమే సావర్కర్ ఐడియాలజీ..!

రాయపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైన, ఆయన దేశభక్తి మోడల్‌పైన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారంనాడు విమర్శలు గుప్పించారు. బలవంతులకు తలవొగ్గడమే సావర్కర్ ఐడియాలజీ అని వ్యాఖ్యానించారు. భారత్ జోడో యత్రలో తనకు ఎదురైన అనుభవాలను, యాత్రకు లభించిన విశేష ప్రజాదరణను గుర్తుచేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారంనాడు సదస్సును ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, భారత్ జోడో యాత్ర నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఉన్నారు. ''నా దేశం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ నడిచాను. వేలాది మంది నాతోనూ, పార్టీతోనూ మమేకమయ్యారు. రైతుల సమస్యలన్నింటినీ విని, వారి బాధలేమిటో ఆకలింపు చేసుకున్నాను. మహిళలు, యువకుల ఆవేదనను అర్ధం చేసుకున్నాను. లక్షలాది మంది యాత్రలో మాతో కలిసి నడిచారు. మంచు, వర్షాలు, ఎండలను కూడా లెక్కచేయకుండా ఎంతో సాహసంగా మాతో కలిసి ప్రయాణించారు. భారత్ జోడో యాత్ర ద్వారా కశ్మీర్‌ యువకుల్లో త్రివర్ణ పతాకం పట్ల ప్రేమను పాదుకొలిపాం'' అని చెప్పారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు సహజంగానే తాను అసహనంగా ఉంటానని, కాలినొప్పితో ఇలాంటి అసహనానికి గురైనప్పటికీ భారత్ జోడో యాత్ర ప్రారంభించే సరిగా ఒక్కసారిగా అదంతా మటుమాయమైందని తెలిపారు. భరతమాత నుంచి అందిన సందేశంతో తనకు ఎంతో బలం చేకూరిందని అని రాహుల్ అన్నారు.

అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని వాళ్లు (కేంద్రం) చెప్పినప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితిని తమ కుటుంబ ఎదుర్కోవాల్సి వచ్చిందో తనకు బాగా గుర్తుందని రాహుల్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ప్లీనరీలో పాల్గొన్న సోనియాగాంధీ సహా కాంగ్రెస్ కార్యకర్తలు చిరునవ్వులు చిందిస్తూ రాహుల్‌ను ఉత్సాహపరచడం కనిపించింది.

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం విద్వేష ప్రచారం ద్వారా దేశాన్ని ధ్వంసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో చివరిగా జమ్మూకశ్మీర్‌లో తాను అడిగనప్పుడు ముఖ్యంగా యువత ఎంతో ఆదరంగా ముందుకు వచ్చి కశ్మీర్‌లో పర్యటించినందుకు తనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. కశ్మీర్‌లో మతం పేరుతో యువత వివక్షకు గురవుతోందని ఆరోపించారు.

జైశంకర్ వ్యాఖ్యలపై విసుర్లు...

బలమైన ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో ఎలా ఫైట్ చేస్తామని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలను నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా రాహుల్ తప్పుపట్టారు. ''భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలను శంకిస్తూ మాట్లాడిన ఆ మంత్రి పేరును నేను ప్రస్తావించదలచుకోలేదు. ఇది నిశ్చయంగా బలవంతులకు తలవంచడమనే సావర్కర్, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాతో ఎలా పోరాటగలమని అనడం దేశభక్తి ఎంతమాత్రం కాదు, పిరికితనం'' అని అన్నారు.

Updated Date - 2023-02-26T14:10:16+05:30 IST