Sharad pawar: షాకింగ్ నిర్ణయంపై పునరాలోచనకు పవార్ ఓకే..!
ABN , First Publish Date - 2023-05-02T19:10:08+05:30 IST
ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ చేసిన ప్రకటన సొంత పార్టీలో..
ముంబై: ఎన్‌సీపీ (NCP) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) చేసిన ప్రకటన సొంత పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. పవార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఎన్‌సీపీ కార్యకర్తలు నిరసనలకు దిగడంతో పాటు రాజీనామాల పర్వం కూడా మొదలుకావడంతో పవార్ తన నిర్ణయంపై పునరాలోచనకు అంగీకరించారు. తనకు కొంత వ్యవధి ఇవ్వాలని, ఇందుకు రెండు, మూడు రోజులు అవసరం అవుతుందని పవార్ చెప్పినట్టు ఆయన మేనల్లుడు, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ (Ajit pawar) మంగళవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. పవార్ కుమార్తె సుప్రియా సులె, అజిత్ పవార్, తదితర నాయకులు శరద్‌పవార్‌ను కలుసుకున్నారు. వీరంతో పవార్‌తో మాట్లాడటంతో ఆయన తన నిర్ణయంపై పునరాలోచనకు అంగీకరించారు.
''నేను నా వరకూ నిర్ణయం తీసుకున్నాను. అయితే మీ అందరి కారణంగా నా నిర్ణయాన్ని పునరాలోచిస్తాను. నాకు రెండు, మూడు రోజులు సమయం కావాలి. అదికూడా కార్యకర్తలంతా ఇళ్లకు వెళ్లిపోతే ఆలోచిస్తాను. కొందరు పార్టీ పదవులకు కూడా రాజీనామాలు చేస్తున్నారు. వెంటనే దీనిని ఆపేయాలి'' అని పవార్ తమకు తెలిపినట్టు అజిత్ పవార్ మీడియాకు తెలిపారు. పవార్ నిర్ణయంతో పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధ్యక్షుడిగా పవార్ ఉంటూనే ఆయన కింద వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించుకోవాలని తాము పెద్దాయనకు సూచించినట్టు అజిత్ పవార్ చెప్పారు. తమ మాటలను సావధానంగా పవార్ విన్నారని, నిరసన తెలుపుతున్న కార్యకర్తలతో మొదట మాట్లాడి ఆ తర్వాతే ఇక్కడకు తిరిగి రావాలని ఆయన సూచించారని తెలిపారు 83 ఏళ్ల పవార్ తన వయోభారాన్ని ప్రస్తావిస్తూ, తన రాజీనామా నిర్ణయాన్ని మంగళవారం ఉదయం ప్రకటించారు.