Sharad Pawar: ఈసీ ఆదేశాలపై పవార్ తొలి స్పందన, మద్దతు ఆయనకే ఉందని వెల్లడి
ABN , First Publish Date - 2023-02-22T17:09:12+05:30 IST
శివసేన పార్టీ పేరు, 'విల్లు-బాణం' గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఈనెల 17న తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో..
ముంబై: శివసేన పార్టీ పేరు, 'విల్లు-బాణం' గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ (EC) ఈనెల 17న తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తొలిసారి స్పందించారు. ఈసీ తీసుకున్న నిర్ణయం లాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఉద్ధవ్ థాకరేకు ప్రజల మద్దతు ఉందని చెప్పారు.
షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న సంచలన నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఉద్ధవ్ థాకరే వర్గానికి కీలకమైన ఎదురుదెబ్బ తగిలింది. ఈసీ నిర్ణయాన్ని పలు పార్టీలు తప్పుపట్టగా, ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. 'మహా వికాస్ అఘాడి' గత సర్కారులో ఎన్‌సీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ శరద్ పవార్ మాత్రం వెంటనే స్పందించలేదు. ఎట్టకేలకు బుధవారంనాడు ఛింద్వాడాలో జరిగిన మీడియా సమవేశంలో పవార్ తొలిసారి పెదవి విప్పారు.
''రాజకీయ అంసతృప్తులు, విభజనలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయితే పార్టీని, పార్టీ గుర్తును స్వాధీనం చేసుకోవడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. దీనిపై తీర్పులిచ్చే అధికారం నిజంగా ఈసీకి ఉందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది'' అని పవార్ అన్నారు. తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టినప్పటికీ తాను ఎలాంటి క్లెయిమ్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జరిగినట్టు (ఈసీ నిర్ణయం) మాత్రం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే అన్యాయం జరిగిన పార్టీ వైపే ప్రజలు ఉంటారని అన్నారు. తాను ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నానని, ఉద్ధవ్ థాకరేకు ప్రజల మద్దతు ఉన్నట్టు ఈ పర్యటనలో చాలా స్పష్టంగా తేలిందని పవార్ తెలిపారు.